
దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నటి రేణూ దేశాయ్ మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె చేసిన పాత్రా, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ తన జీవిత లక్ష్యాలు, వచ్చిన విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'కమ్ బ్యాక్ విమర్శలపై' రేణూ కౌంటర్!
'టైగర్ నాగేశ్వరరావు' సినిమా చేసినప్పుడు తనపై వచ్చిన విమర్శలను రేణూ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేను 'టైగర్ నాగేశ్వరరావు' చేయగానే కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తుంది అంటూ కొన్ని విమర్శలు రాశారు. ఆ సినిమా విడుదలై ఇప్పుడు రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకు నేను మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. కొత్తగా ఏ సినిమాకు సైన్ చేయలేదు కూడా అని రేణూ పేర్కొన్నారు.
అత్త గారి పాత్రకు ఓకే
తన గురించి అవాకులు చెవాకులు మాట్లాడినవాళ్లు ఇప్పుడు వచ్చి సారీ చెప్పరు కదా అని రేణూ దేశాయ్ ప్రశ్నించారు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ అదే నా లక్ష్యం కాదు అని స్పష్టం చేశారు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తానని, కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వనని తేల్చి చెప్పారు. తన రాబోయే సినిమా గురించి చెబుతూ.. ప్రస్తుతం అత్త గారి పాత్రకు ఒక సినిమాకు ఓకే చెప్పాను. త్వరలోనే ఆ సినిమా ప్రారంభం కానుంది అని రేణూ దేశాయ్ వెల్లడించారు.
సన్యాసంపై షాకింగ్ కామెంట్స్!
తన భవిష్యత్తు ప్రణాళిక గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని చెప్పారు. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాక్టింగ్‌ను అభిరుచిగా భావించే రేణూ.. ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆమె తదుపరి చిత్రంతో పాటు ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి..