దిశా కేసు ఎన్ కౌంటర్పై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణ

దిశా కేసు ఎన్ కౌంటర్పై  సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై  విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్‌ నివేదికపై  హైకోర్టు ఇవాళ.. 2023, ఏప్రిల్ 12వ తేదీన విచారించనుంది. జనవరిలో హైకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. 

 దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో గతంలో బాధితుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వృందా గ్రోవర్ వాదించారు. ఎన్ కౌంటర్ తీరును కోర్టు దృష్టికి తీసుకు వచ్చిన ఆయన... పోలీసులు తెలిపిన పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలీసు కస్టడీలోని ఉన్న నలుగురు నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసే పేరుతో ఎన్ కౌంటర్ చేశారని కోర్టుకు వివరించారు. సీసీ టీవీలో లారీని చూసి మొదట గుర్తు పట్టింది ఓనర్ శ్రీనివాస్ రెడ్డి అని పోలీసులు తెలిపారని....కానీ కమిషన్ ముందు లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి ఆ విషయం చెప్పలేదన్నారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఓ కట్టుకథ అని  సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చింది.  పోలీసుల వాంగ్మూలంలో తప్పులున్నాయని చెప్పిన కమిషన్... వాస్తవంగా ఏం జరిగిందో చెప్పడంలో విఫలం అయిందని పోలీసుల తరఫు వాదించిన న్యాయవాది కోట కీర్తి కిరణ్ తెలిపారు.  మూడేళ్ల కిందట హైదరాబాద్ సమీపంలో  జరిగిన దిశ అఘాయిత్యం, హత్య అప్పట్లో కలకలం రేపింది. అనంతరం వారం రోజులకే ఈ కేసులో నిందితులు ఎన్ కౌంటర్ కావడం  సంచలనంగా మారింది. అయితే ఇది  బూటకపు ఎన్ కౌంటర్ అని జస్టిస్ సిర్పూర్కార్ కమిషన్ తేల్చింది. ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న విషయాలు నమ్మ దగ్గవిగా లేవని  పేర్కొంది.