వెంకటరమణారెడ్డి ఆమరణ దీక్ష

వెంకటరమణారెడ్డి ఆమరణ దీక్ష

కామారెడ్డి, వెలుగు : ధరణితో రైతుల గోస పడుతున్నారని, కామారెడ్డి నియోజకవర్గంలో భూ అక్రమాలపై కలెక్టర్ ​స్పందించాలని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి మంగళవారం నుంచి అమరణ నిరాహార దీక్షకు దిగారు. కామారెడ్డిలో ఆరు రోజులుగా నిరసన దీక్ష, నిరాహార దీక్షలు చేపట్టినా కలెక్టర్ ​స్పందించకపోవడంతో ఆమరణ దీక్ష చేయబోతున్నట్టు ఇంతకుముందే ప్రకటించారు. మున్సిపల్​ ఆఫీసు సమీపంలో దీక్షా స్థలికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి నిజామాబాద్​జిల్లా డిచ్​పల్లి పోలీస్​స్టేషన్​కు, తర్వాత ధర్పల్లి, సిరికొండలకు, తర్వాత కామారెడ్డి జిల్లా రామారెడ్డి పీఎస్​కు తరలించారు.  మున్సిపల్​ ఆఫీసు ఎదురుగా అంబేద్కర్​ విగ్రహం దగ్గర దీక్ష కోసం టెంట్​ వేయగా డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వచ్చారు. 30 పోలీస్​యాక్ట్ అమలులో ఉందని, అందరినీ పంపించే ప్రయత్నం చేశారు. మరో వైపు వెంకటరమణారెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్​జిల్లా వైపు తీసుకెళ్తున్నారని తెలిసి పార్టీ శ్రేణులు రాస్తారోకోకు సిద్ధమయ్యాయి. దీంతో పోలీసులు టెంట్​తొలగించి సామగ్రిని తరలించారు.  నిజాంసాగర్​చౌరస్తాలో రాస్తారోకో చేసేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేసి  బీబీపేట, మాచారెడ్డి,  దేవునిపల్లి పోలీస్​స్టేషన్లకు తరలించారు.  

పోలీస్ స్టేషన్​లోనూ కొనసాగిన దీక్ష

వెంకటరమణా రెడ్డిని ఒక పీఎస్​ నుంచి మరొక పీఎస్​కు మారుస్తూ చివరకు రామారెడ్డి పోలీస్​స్టేషన్​కు తీసుకురాగా అక్కడే ఆయన అమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదో ఒకటి తేలే వరకు దీక్ష ఆపేది లేదని స్పష్టం చేశారు. వెంకటరమణారెడ్డిని కలిసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు మూసేశారు. పలువురు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్​ఎంపీ ధర్మపురి అర్వింద్​వచ్చి వెంకటరమణారెడ్డికి సంఘీభావం తెలిపారు. 

ఇంటి వద్ద కూడా...

పోలీస్ స్టేషన్​లో వెంకటరమణారెడ్డి అమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న పలువురు పార్టీ కార్యకర్తలు, లీడర్లు మంగళవారం రాత్రి వరకు వందల సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో పోలీసులు పరిస్థితి అదుపు తప్పేలా ఉందని భావించారు. చివరకు 8.30 గంటలకు వెంకటరమణారెడ్డిని కామారెడ్డిలోని ఆయన ఇంట్లో దిగబెట్టారు. అయినా ఆయన అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. మద్దతుగా వచ్చిన కార్యకర్తలు కూడా దీక్షలో కూర్చున్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార ఆయనను కలిసి సంఘీభావం తెలిపారు.