- వర్సిటీలో ఉన్నతస్థాయి కమిటీ పర్యటన
- సమీక్షించిన సీఎం సలహాదారుకే కేశవరావు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అగ్రగామి విద్యా సంస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సలహాదారు కే కేశవరావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం ఓయూ క్యాంపస్‌లో పర్యటించింది. ఇంజనీరింగ్, ఆర్ట్స్, లా కాలేజీలు, లైబ్రరీ, వివిధ హాస్టళ్లు సహా క్యాంపస్‌లోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి, వసతులను కమిటీ ప్రతినిధులు పరిశీలించారు. రానున్న 30 ఏండ్ల విద్యా అవసరాలకు తగ్గట్టుగా ఓయూ సమగ్రాభివృద్ధి కోసం రూ.వెయ్యికోట్ల నిధులతో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీ అభిప్రాయపడింది.
అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధానంగా ఇంటర్నేషనల్ లెవెల్లో క్లాస్ రూములు, అత్యాధునిక ఆడిటోరియాలు, కేంద్రీకృత డిజిటల్ లైబ్రరీ, ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థి నివాసాలు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించిన కమిటీ, వాటికి తక్షణమే సమగ్ర పునరుద్ధరణ, ఆధునీకరణ అవసరమని నిర్ధారించింది. వీటితో పాటు పర్యావరణ అనుకూల వాతావరణం, సౌరశక్తి వినియోగం, కేంద్రీకృత వ్యాయామశాలల ఏర్పాటు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. మౌలిక వసతుల కల్పన ద్వారా ఓయూను విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు నిలయంగా మార్చడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఈ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, ఇక్కడి విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా రాణించేందుకు అవకాశం కల్పిస్తాయని, ఓయూ ఖ్యాతిని మరో వెయ్యి సంవత్సరాల వరకు కొనసాగించవచ్చని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కాగా, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళికలు తయారు చేసేందుకు సీఎం సలహాదారు కే కేశవరావుతో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తదితరులు కమిటీ సభ్యులతో సమీక్షించారు. సమావేశంలో ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు, ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతి రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ గంటా చక్రపాణి, రిటైర్డ్ ఇంజినీర్లు బషారత్ అలీ, టి బాబు రాజు, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
