హైదరాబాద్, వెలుగు: ఇక నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కావాలంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్అప్ లోడ్ చేయాల్సిందేనని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తెలిపారు. బుధవారం అన్ని జిల్లాల ఆర్టీవో, డీటీవో, ఎంవీఐలతో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
వాహనదారుడు ఆర్సీ, డీఎల్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిర్దేశించిన గడువులోగా వారికి అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా జిల్లా స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రింటింగ్ సందర్భంలో ఏర్పడే సాంకేతిక లోపాలను అధిగమించాలని కోరారు.
