గోదావరి లోయలో హైటెన్షన్‌‌

గోదావరి లోయలో హైటెన్షన్‌‌
  • తెలంగాణ ‒ చత్తీస్‌‌గఢ్‌ ‌సరిహద్దుల్లో కూంబింగ్‌‌

భద్రాచలం, వెలుగు: తెలంగాణ‒చత్తీస్‌‌గఢ్‌ ‌సరిహద్దుల్లోని గోదావరి లోయలో హైటెన్షన్‌ ‌నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్‌‌ ఆపరేషన్‌ ‌నిర్వహిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోకి మావోయిస్టులు చొరబడ్డట్లుగా రాష్ట్ర పోలీసులు పసిగట్టి అన్ని జిల్లాలను అప్రమత్తం చేశారు. దీనికి తోడు భద్రాద్రికొత్తగూడెం‒అల్లూరి సీతారామరాజు పాడేరు(ఆంధ్రా) జిల్లాల జాయింట్​సెక్రటరీ ఆజాద్‌ ‌అలియాస్‌ ‌కొయ్యాడ సాంబయ్య కార్యకలాపాలు ఈ ప్రాంతంలో ఎక్కువవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. జులై నెలలో మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభను తెలంగాణ‒చత్తీస్‌‌గఢ్‌ ‌సరిహద్దుల్లో ఆదివాసీల సమక్షంలో నిర్వహించారు. చర్ల మండలంలో లొంగిపోయిన మావోయిస్టు జీవన్‌‌ను కిడ్నాప్‌ ‌చేసి ప్రజాకోర్టు కూడా పెట్టారు. తొలి తప్పుగా భావించి అతనిని ఆదివాసీల అభ్యర్థన మేరకు వదిలేశారు. మరికొద్ది రోజులకే చర్ల మండలం కుర్నపల్లి ఉప సర్పంచ్‌‌ఇర్పా రాములును ఇన్‌‌ఫార్మర్‌‌ పేరుతో దారుణంగా హత్య చేశారు. మరోవైపు దండకారణ్యానికి ముఖద్వారంగా నిలిచే భద్రాచలం డివిజన్‌‌లోని గోదావరి లోయ తెలంగాణలోకి దళాల ప్రవేశానికి అనుకూలంగా మారడంతో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను రంగంలోకి దించారు. ఆజాద్‌ ‌దూకుడుకు కళ్లెం వేసేందుకు పక్కా స్కెచ్‌ ‌వేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని అడవుల్లో అన్వేషణ మొదలుపెట్టారు. ఏఎస్పీ రోహిత్‌‌రాజు నేతృత్వంలో అన్ని ఆదివాసీ గ్రామాల్లో ఆజాద్‌‌ ,అరుణ, మధు, రామ్‌‌దా, రాజేశ్‌, బాలు, సందీప్‌‌, రజిత తదితర లీడర్ల ఫోటోలతో వాల్‌‌పోస్టర్లు అంటించారు. వారిపై ఉన్న రివార్డుల వివరాలు తెలుపుతూ పట్టించిన వారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు.  సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రచారం చేస్తున్నారు. 

ఆజాద్​పై ఓఎస్డీ ఫైర్​

ఆజాద్‌‌ అలియాస్‌ ‌కొయ్యాడ సాంబయ్యపై భద్రాచలం ఓఎస్డీ సాయిమనోహర్‌ ‌ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్‌ ‌చేశారు. ఇన్‌‌ఫార్మర్ల పేరిట అమాయక ఆదివాసీలను ఆజాద్‌ ‌హత్య చేస్తున్నారని ఆరోపించారు. ఉనికిని కోల్పోయిన మావోయిస్టులు ఆదివాసీ గ్రామాల్లో పట్టుకోసం భయభ్రాంతులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం పోటీపడి విఫలమైన ఆజాద్‌ ‌ఆదివాసీలపై హత్యాకాండకు దిగుతున్నారని తీవ్రస్థాయిలోఆరోపించారు. విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్న ఆజాద్‌‌కు ఆదివాసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదివాసీలు ఆకర్షితులై మావోయిస్టులకు దూరం అవుతున్నారన్నారు. పలువురు సభ్యులు కూడా జనజీవనస్రవంతిలోకి రావడాన్ని మావోయిస్టు పార్టీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. రాష్ట్రంలోకి మావోయిస్టులను అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.

రంగంలోకి బలగాలు

ఆజాద్‌‌తో పాటు పలువురు లీడర్లను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. గోదావరి లోయలో అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.  ఈసారి నేషనల్‌‌ సెక్యూరిటీ గార్డు(ఎన్‌‌ఎస్‌‌జీ)లు 120 మందికి పైగా మావోయిస్టులే లక్ష్యంగా వేటకు దిగారు. వీరు కేవలం దేశంలో అంతర్గత భద్రతకే ఎక్కువగా పనిచేస్తారు. ప్రత్యేకంగా మావోయిస్టుల కోసం కూంబింగ్‌‌కు కూడా వినియోగించడం ద్వారా వారికి అనుభవం కల్పించాలని కేంద్ర హోంశాఖ భావించి గ్రేహౌండ్స్, యాంటీ నక్సల్స్ స్వ్కాడ్‌ ‌బలగాలకు జత కలిపారు. ప్రస్తుతం చత్తీస్‌‌గఢ్‌ ‌దండకారణ్యంతో పాటు చర్ల, దుమ్ముగూడెం అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్‌‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తెలంగాణ‒చత్తీస్‌‌గఢ్‌ ‌అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

మావోయిస్టులు కనిపిస్తే సమాచారమివ్వండి

మహాముత్తారం/మహబూబాబాద్/ములుగు, వెలుగు: మావోయిస్టులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని మహబూబాబాద్​ఎస్పీ శరత్​చంద్రపవార్, ములుగు ఏఎస్పీ సుధీర్ రాంనాథ్​కేకన్​ప్రజలను కోరారు. ప్రజలు మావోయిస్టులకు సహకరించకూడదని, వారికి ఎలాంటి ఆశ్రయం కల్పించకూడదని సూచించారు. ములుగులో 8 మంది మావోయిస్టు అగ్రనేతల ఫొటోలతో కూడిన వాల్​పోస్టర్​ను ఏఎస్పీ ఆవిష్కరించారు. వాల్​ పోస్టర్​లో చూపించిన బడే చొక్కారావు అలియాస్​ దామోదర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్​వెంకటేశ్, ముచకి ఉంగల్​ అలియాస్​రఘు, కవ్వాసి గంగ అలియాస్​ మహేశ్, కుంజ వీరయ్య అలియాస్​లచ్చయ్య, కొవ్వాసి రాము, కుర్సం మంగు అలియాస్​ భద్రు, మడకం సంగల్​అలియాస్​ మంగతూలు ములుగు జిల్లాలో తిరుగుతున్నారని, వారికి ఎవరైనా సహకరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ములుగు బస్టాండులో మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్​ పోస్టర్​ను ఏఎస్పీ స్వయంగా అంటించారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని అటవీ గ్రామాల్లో బుధవారం ఎస్సై రమేశ్​ ఆధ్వర్యంలో పోలీసులు మావోయిస్టు నేతల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ఉన్న వ్యక్తులు ఎక్కడైనా కనబడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వారిపై రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు రివార్డు ఉందని తెలిపారు.