జోగిపేట, వెలుగు : నియోజకవర్గంలోని మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా 'ఫ్యూచర్ ఫిఫ్త్ సిటీ'గా ఏర్పాటు చేయాలని జోగిపేట మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ గంగా జోగినాథ్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో మంత్రి దామోదర రాజనర్సింహను అధికారిక నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జోగినాథ్ మాట్లాడుతూ మంజీరా నది పరీవాహక ప్రాంతం అభివృద్ధి చేస్తే అందోలు నియోజకవర్గం విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో గణనీయమైన మార్పు సాధిస్తుందని తెలిపారు. దీనితో పాటు సింగూరు రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాజెక్ట్ మధ్యలో ఉన్న ఐల్యాండ్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్ది, పర్యాటక, పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిపై మంత్రి రాజనర్సింహ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.
