వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం సంబురంగా జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమానికి హాజరై గ్రామాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
- హన్వాడ మండలం యారోనిపల్లి సర్పంచ్ గా ఎన్నికైన శావకుల స్వాతి తిరుపతయ్య ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామస్తులు పార్టీలకతీతంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.
- పాన్‌గల్ మండలం శాఖాపూర్ తండా కొత్త సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న నేనావత్ నాగేశ్ నాయక్ తన తల్లిదండ్రులు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన స్థలాన్ని గ్రామపంచాయతీకి సొంత బిల్డింగ్ లేకపోవడంతో 3 గుంటల భూమిని విరాళంగా ఇస్తూ బాండ్ రాసిచ్చాడు. గ్రామంలోని వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం రూ. 1లక్ష విరాళం ఇచ్చాడు.
- చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సర్పంచ్‌గా రంజిత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సర్పంచ్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై ఆయనను సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
- కేంద్ర ప్రభుత్వ, ఎంపీ నిధులతో ఊట్కూర్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్ సూచించారు. ఊట్కూర్ సర్పంచ్‌గా ఎం.రేణుక భరత్ కుమార్, ఉప సర్పంచ్‌గా ఆర్.రమేశ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వారిని బీజేసీ నాయకులు సన్మానించి అభినందించారు. ఊట్కూర్ మండలంలో 8 సర్పంచ్ స్థానాలను బీజేపీ గెలవడం హర్షణీయమన్నారు. చంద్రశేఖర్ గౌడ్, సోమశేఖర్, ఎం.శేషప్ప, కృష్ణయ్య గౌడ్, ఎం విజయ్ కుమార్, కుర్వ ఆశప్ప, లక్ష్మణ్, కొండన్ గోపాల్, రమేశ్, దొబ్బలి హన్మంతు, రోషణప్ప పాల్గొన్నారు.
- గ్రామాల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి తెలిపారు. కడ్తాల్, మైసిగండి, ఎక్వాయిపల్లి, తలకొండపల్లి మండలం పడకల్ గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొన్నారు.
- గ్రామాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొత్తగా కొలువుదీరిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరై వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఖిల్లాగణపురం మండలం రోడ్డుమీది తండా, ఖిల్లాగణపురం, సోలిపురం, పెద్దమందడి మండలం వీరాయపల్లి, పామిరెడ్డిపల్లి, చిన్న మందడి,పెద్దమందడి, పెబ్బేరు మండలం తోమాలపల్లి, వై శాఖాపురం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పామిరెడ్డిపల్లిలో జీపీ బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
- జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం కొండాపురం సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం గందరగోళానికి దారితీసింది. 8 మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ జీపీలో ప్రమాణ స్వీకారం చేయగా, ఇద్దరు వార్డు మెంబర్లు, సర్పంచ్ దత్తాత్రేయ ఆలయం వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.
