యూసుఫ్ గూడలో హై టెన్షన్: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల వాగ్వాదం

యూసుఫ్ గూడలో హై టెన్షన్: బీఆర్ఎస్ అభ్యర్థి సునీత, కాంగ్రెస్ నేతల వాగ్వాదం

జూబ్లీహిల్స్ పోలింగ్ తీరు.. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు హై టెన్షన్ పుట్టిస్తుంది. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా కంప్లయింట్స్ చేసుకోవటం జరుగుతుంది. ఈ క్రమంలోనే యూసుఫ్ గూడలోని సవేర ఫంక్షన్ హాల్ దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. 

యూసుఫ్ గూడలోని సవేర ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ ఏజెంట్లు, కార్యకర్తలు, నేతలను కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తున్నారంటూ స్పాట్‎కు వచ్చారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి కూడా టేబుళ్లు ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు టేబుళ్లు వేసుకుంటే కాంగ్రెస్ వాళ్లు బెదిరించి తీయించివేస్తున్నారంటూ అక్కడే ఉన్న పోలీసులకు కంప్లయింట్ చేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ అభ్యర్థి. రెండు వర్గాలను సముదాయించి.. అక్కడి నుంచి పంపించి వేశారు పోలీసులు. 

బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ శ్యామలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకొచ్చారని.. ఏం చర్యలు తీసుకుంటారంటూ భద్రతా సిబ్బందిని నిలదీశారామె. నాన్ లోకల్ అయిన కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారని.. పోలింగ్ రోజు వాళ్లకు ఇక్కడ పని ఏంటంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె. 

పోలింగ్ కేంద్రాల దగ్గర స్థానిక కాంగ్రెస్ లీడర్ ఫసీయుద్దీన్.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ తిరుగుతున్నారని.. ఓటర్లను బెదిరించి ఓట్లు వేయిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. దీనిపై పోలీసులు స్పందించారు. నాన్ లోకల్స్ ఎవరూ నియోజకవర్గంలో లేరని.. అందర్నీ హెచ్చరించి పంపించి వేశామని.. ఎవరైనా కనిపిస్తే కేసులు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా.. శాంతియుతంగా సాగుతుందని వివరించారు పోలీసులు.