వరంగల్ లో ముగింపు సభపై ఉత్కంఠ

వరంగల్ లో ముగింపు సభపై ఉత్కంఠ
  • సంజయ్‍ పాదయాత్రపై హైటెన్షన్‍
  • వరంగల్ లో ముగింపు సభపై ఉత్కంఠ
  • స్టేషన్ ఘన్ పూర్​ లో  బండి సంజయ్ అరెస్ట్
  • ప్రజాసంగ్రామ యాత్ర భగ్నం
  • పాదయాత్ర నిలిపివేయాలని పోలీసుల నోటీసు
  • నిర్వహించి తీరుతామంటున్న బీజేపీ లీడర్లు

వరంగల్‍, స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ నియోజకవర్గంతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సంజయ్ పాదయాత్రపై హైటెన్షన్ నెలకొంది. మంగళవారం స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూరులో బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు అడ్డుకుని.. బలవంతంగా అక్కడి నుంచి కరీంనగర్ కు తరలించారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. మరోవైపు టీఆర్ఎస్ లీడర్లు పాదయాత్ర ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చింపేశారు. కర్రలు చేతపట్టి, రోడ్లపై నానా హంగామా చేశారు. ఇదిలా ఉండగా, పాదయాత్రను నిలిపివేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

పాదయాత్రకు నో చెప్పిన పోలీసులు.. 

బీజేపీ షెడ్యూల్‍ ప్రకారం పాదయాత్ర మరో నాలుగు రోజుల పాటు ఉంది. ఈ నెల 27న వరంగల్​లో ముగింపు సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సభకు చీఫ్ గెస్టుగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించారు. కాగా, మంగళవారం బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈ యాత్ర వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పోలీసులు నోటీసులు ఇవ్వగా.. పాదయాత్ర నిర్వహించి తీరుతామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. పార్టీ లీగల్‍ సెల్‍ తరఫున హైకోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు.

కేసీఆర్ కుటుంబంపై బీజేపీ కుట్ర
ఎమ్మెల్యే  రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డా.రాజయ్య ఆరోపించారు. మంగళవారం తన క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చికూతలు కూస్తున్నారని, ఆయన భాషను సమాజం వ్యతిరేకిస్తోందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవితపై లేనిపోని అభియోగాలు మోపుతూ.. బీజేపీ లీడర్లు ఆమె ఇంటిపై దాడులకు పాల్పడడం దారుణమన్నారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి, రాజకీయంగా పబ్బం గడుపుకొనే బీజేపీని తరిమికొడ్తామని హెచ్చరించారు. పచ్చగా ఉన్న తెలంగాణను నాశనం చేసేందుకే బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. బీజేపీ పాదయాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని, యాత్రను అడ్డుకునేందుకు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చారని పేర్కొన్నారు. బీజేపీకి దమ్ముంటే దేశవ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలని డిమాండ్​చేశారు.

మంత్రి ఎర్రబెల్లి డైరెక్షన్ లోనే అడ్డంకులు..
రావు పద్మ

హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీ అక్రమాలు, అరాచకాలను ప్రజలకు వివరిస్తున్నందుకే బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. మంత్రి దయాకర్​రావు డైరెక్షన్​ లోనే పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్​ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం హనుమకొండ హంటర్​ రోడ్డులోని బీజేపీ ఆఫీస్​లో పార్టీ నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్​ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే టీఆర్ఎస్ పెద్దలు పోలీసులు, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మేయర్​ తో పాటు ఇతర పదవుల్లో  ఉన్నవారు కూడా తమ పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని, టీఆర్ఎస్​ లీడర్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండె విజయరామారావు, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తదితరులున్నారు.