డెంగీ ఫీవర్..ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు

డెంగీ ఫీవర్..ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు

రాష్ట్రమంతటా జనాల్ని డెంగీ వంటి జ్వరాలు పట్టిపీడిస్తుంటే నివారణ చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు నిలదీసింది. నెల రోజుల్లోగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని.. జ్వరాలను కంట్రోల్​ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత కూడా ప్రజలు జ్వరాలతో బాధపడుతూ ఉంటే తాము సీరియస్ గా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. డెంగీ, వైరల్ ఫీవర్లపై డాక్టర్ కరుణ, లాయర్‌‌ రాపోలు భాస్కర్‌‌ వేరువేరుగా వేసిన పిల్స్‌‌ను బుధవారం హైకోర్టు సీజే జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్‌‌ విచారించింది. డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ జీహెచ్‌‌ఎంసీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వేసిన కౌంటర్‌‌ పిటిషన్లలో డెంగీ బాధితులు పెరిగారని తెలుసుకున్న డివిజన్ బెంచ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో 138  డెంగీ కేసులుంటే ఆ తర్వాత 22 రోజుల్లో 309కి పెరిగాయని, ఇది రెండు వందల శాతం ఎక్కువ అంటూ ఇంత పెద్ద హైదరాబాద్‌ నగరంలో చాలినన్ని ఫాగింగ్‌ యంత్రాలు లేకపోవడమేంటని హైకోర్టు మండిపడింది. జనవరి నుంచి 5,914 డెంగీ కేసులు నమోదు అయ్యాయంటే.. దోమల్ని గుడ్డు దశలోనే అంతం చేయలేకపోతున్నట్లు స్పష్టం అవుతోందని పేర్కొంది. వచ్చే నెల రోజుల్లోగా విష జ్వరాల్ని అంతం చేయాలని, లేనిపక్షంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు ఇవ్వాల్సివస్తుందని హెచ్చరించింది. తాము సూచనలు చేస్తుంటే అమలు చేయడం లేదని తప్పుపట్టింది. డ్రోన్ల సాయంతో మురికివాడల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రచారాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. హైదరాబాద్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రం అంతటా ఇంకెంత దారుణంగా ఉందోనని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఇంత పెద్ద రాష్ట్రానికి 22 బ్లడ్ బ్యాంకులేనా

రాష్ట్రంలో కేవలం 22 బ్లడ్‌ బ్యాంక్‌లు మాత్రమే ఉంటే జ్వరం బాధితులకు ఎలా సరిపోతాయంటూ అధికారులను డివిజన్ బెంచ్ నిలదీసింది. వర్షాలు ఎక్కువగా పడుతున్న ఇలాంటి సందర్భంలో అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే వైరల్ ఫీవర్లను అదుపు చేయడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వం వేస్తున్న కౌంటర్‌లు చూస్తే గ్రామ స్థాయికి వెళ్లి.. వాస్తవాలను అంచనా వేసినట్లుగా లేదని, ఏదో వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లుగా ఉందని బెంచ్‌ మండిపడింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల సమాచారం ఇవ్వొద్దంటూ ఆఫీసర్లు ఆంక్షలు పెట్టారని మీడియాలో వార్తలు రావడం దారణమని, దీనిపై అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని ఆదేశించింది. సమగ్ర అఫిడవిట్‌ వేసేందుకు గడువు ఇవ్వాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోరడంతో డివిజన్‌ బెంచ్‌ కల్పించుకుని అఫిడవిట్లల్లో అన్నీ సగం సగం సత్యాలేనని, ఎన్ని సార్లు టైం కోరతారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 23 కి కేసు వాయిదా వేసింది.