ఉన్నత విద్యను..పటిష్టం చేయాలి : అశోక్ దనవత్

ఉన్నత విద్యను..పటిష్టం చేయాలి : అశోక్ దనవత్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో  ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విద్యార్థులు పోషించిన పాత్రపైన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సామాజిక శాస్త్రపరిశోధకులు పరిశోధన చేశారు.  ఉద్యమంలో వారి పాత్రను  పరిశోధనల్లో  గుర్తించారు. 

ఆ నాటి ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలను ఆక్స్​ఫర్డ్, హార్వర్డ్ స్థాయిలలో అభివృద్ధి పరిచి ఉన్నత విద్యను అందరికీ చేరువయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పటంతో విద్యా ర్థులు కూడా ఆ మాటలను నమ్మారు.  అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వారి వంతు కీలక పాత్ర పోషించారు. ఇంకా నొక్కి చెప్పాలంటే ఉస్మానియా, కాకతీయ విద్యా ర్థులు లేనిదే ప్రత్యేక తెలంగాణ ఏర్పా టు ఎక్కడిది అనేది తెలంగాణ సమాజంలో నానుడిగా ఉంది. 

మోసం చేసిన బీఆర్​ఎస్​ పాలన

మలిదశ ఉద్యమ సమయంలో ఉద్యమ పార్టీగా ప్రధాన పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక  ఉన్నత విద్యకుప్రాధాన్యత ఇస్తారు అని అందరూ అనుకున్నా రు. ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఉన్న  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే తక్కు వ శాతం ఇచ్చింది. 

 అలాగే ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ నియామకాలను చేయకుండా ఉన్నత విద్య అభివృద్ధి, ఆ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు నిర్లక్ష్యం చేసింది.  బీఆర్​ఎస్​ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన నిధులను,  ఉద్యోగ నియామకాలను గమనించినట్లయితే మనకు ఆ విషయం అర్థమవుతుంది.

ఇచ్చిన హామీలను అమలు చేయాలె

గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని గమనించిన విద్యార్థులు, ప్రొఫెసర్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్​ఎస్​ ఓటమిలో  ప్రధాన భూమిక పోషించారు.  అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ విషయం విదితమే. తెలంగాణ  ఆవిర్భవించిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉన్నత విద్య నిర్వీర్యం అయింది అని అనేక సందర్భా లలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. 

ఇపుడు ప్రభుత్వ మార్పుతో విశ్వవిద్యాలయాల అభివృద్ధి జరుగుతుందేమో అని ఆశిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో  విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కొంతమేర వారి మేనిఫెస్టోలో ప్రస్తావించారు. కానీ, పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదు. కొన్ని జిల్లాలలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలకు అత్యాధునిక వసతి గృహాలను నిర్మిస్తామని, మొదటి బడ్జెట్లో యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని పలు అంశాలను మేనిఫెస్టోలో  పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోలా కాకుండా కాంగ్రెస్  ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రధాన అంశంగా గుర్తించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ వర్సిటీలతోనే స్వయం ఉపాధి

ప్రపంచ సంక్షేమ ఆర్థికవేత్తలు ప్రస్తావించినట్లు ప్రభుత్వాలు పౌరుల పేదరికాన్ని  నిరుద్యోగ సమస్యను తొలగించడానికి,  సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే పౌరులు సర్కారుపై ఆధారపడకుండా ఉండటానికి విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు వాళ్ల సామర్థ్యాలను, నైపుణ్యా లను పెంచుకునే విధంగా ప్రభుత్వం చర్యలు  తీసుకోవాలి. అప్పుడే ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుత  కాలమాన పరిస్థితులకు కావాల్సిన నైపు ణ్యాన్ని పొందిన విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల పైన ఆధారపడకుండా వారు స్వతహాగానే నైపుణ్యం ఉన్న రంగాలలో  సంస్థ (స్టార్ట్ అప్) లను ప్రారంభించి ఉద్యోగ కల్పనలకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలుగుతారు. 

- అశోక్ దనవత్,సీనియర్ రీసెర్చర్​, దళిత్ హ్యూమన్ రైట్స్
- నెల్లి సత్య, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి , ఓయూ