అవినీతి పోలీస్​పై​ నజర్.. రెండ్రోజుల్లో నలుగురిపై సస్పెన్షన్ వేటు

అవినీతి పోలీస్​పై​ నజర్.. రెండ్రోజుల్లో నలుగురిపై సస్పెన్షన్ వేటు
  •     పోలీసులపై వచ్చే ఫిర్యాదులపై అంతర్గత దర్యాప్తు
  •     సీరియస్‌‌గా తీసుకుంటున్న ఉన్నతాధికారులు
  •     గ్రేటర్‌‌‌‌లో 18 మంది లిస్ట్‌‌ రెడీ?

‘మియాపూర్‌‌‌‌లో బ్యూటిషీయన్‌‌గా పనిచేస్తున్న ఓ యువతి నుంచి ఆమె ఫ్రెండ్‌‌ రూ.6 లక్షలు తీసుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలు మియాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ కేసును ఎస్సై గిరీష్‌‌ కుమార్ దర్యాప్తు చేశాడు. మోసానికి పాల్పడ్డ  వ్యక్తి నుంచి డబ్బులు రికవరీ చేయించి యువతికి ఇప్పించాడు. ఈ క్రమంలో యువతి ఫోన్‌‌ నంబర్ తీసుకున్న గిరీష్​ కుమార్ ఆమెతో అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు సీపీ అవినాష్‌‌ మహంతికి ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన సీపీ.. గిరీష్‌‌ కుమార్‌‌‌‌పై సస్పెన్షన్ వేటు వేశాడు.’

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ పరిధి 3 కమిషనరేట్లలో పోలీసుల అవినీతిపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. రెండ్రోజుల్లో వ్యవధిలోనే నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కేపీహెచ్ బీ ఇన్ స్పెక్టర్ డి. వెంకటేశ్​, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పీఎస్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాసులును సైబరాబాద్ సీపీ అవినాష్​ మహంతి గురువారం సస్పెండ్ చేశారు. సస్పెషన్స్‌‌కు సంబంధించిన కారణాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరోవైపు ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన మియాపూర్‌‌‌‌ ఎస్సై గిరీష్‌‌కుమార్‌‌‌‌ను మంగళవారం సస్పెండ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రజాభవన్‌‌ వద్ద జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌‌ కేసులో పంజాగుట్ట ఇన్‌‌స్పెక్టర్‌‌ ‌‌దుర్గారావును సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్‌‌ చేశారు. అంతర్గత విచారణ జరిపించి గంటల వ్యవధిలోనే యాక్షన్ తీసుకున్నారు.

స్పెషల్ బ్రాంచ్​తో సమాచార సేకరణ

మాజీ ఐఏఎస్‌‌ అధికారి భన్వర్‌‌‌‌లాల్‌‌ ఇంటి వివాదం కేసులో నిందితుడైన ఐపీఎస్ నవీన్‌‌కుమార్‌‌‌‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే వరుసలో గ్రేటర్‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మరో 18 మంది పోలీస్ అధికారులపై అంతర్గత విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ సిబ్బందితో సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు అందించే సమాచారాన్ని మళ్లీ క్రాస్ చెకింగ్‌‌చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే  రెండ్రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఇన్ స్పెక్టర్లు, ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడటంతో ఏసీపీ, ఇన్ స్పెక్టర్స్, ఎస్సై స్థాయి అధికారుల్లో ఆందోళన మొదలైంది.

సెట్ రైట్ కావాల్సిందే..

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులు, అనుమానితులతో స్థానిక సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితులు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇలాంటి వారు సోషల్‌‌మీడియా ద్వారా లేదా డైరెక్ట్‌‌గా వెళ్లి సీపీలను కలుస్తున్నారు. వీరి ఫిర్యాదులను సీపీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఏసీపీ స్థాయి అధికారులతో అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీస్ సిబ్బంది చేసింది తప్పని తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబరాబాద్‌‌ సీపీ అవినాష్  మహంతి, సిటీ సీపీ శ్రీనివాస్ రెడ్డి తమ మార్క్‌‌ చూపించారు.

లాబీయింగ్‌‌ చేసే అధికారుల చిట్టా రెడీ
 

ఎన్నికలకు ముందు జరిగిన బదిలీలు, పోస్టింగ్స్ పై పోలీస్ బాస్​లు ఫోకస్ పెట్టారు. గతంలో బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ కార్యకర్తలమనే విధంగా పనిచేసిన పోలీస్‌‌ అధికారుల చిట్టాను తయారు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, అన్ని యూనిట్లలో పనిచేస్తున్న ఎస్సై స్థాయి అధికారి నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో సిఫార్స్‌‌ లెటర్లు, రాజకీయనాయకుల ఒత్తిళ్లతో తమకు కావాల్సిన చోట పోస్టింగ్ పొందిన వారిని  గుర్తిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, బాధితులపై విచక్షణరహితంగా దాడులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై పోలీస్ మ్యాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.