వివాహితులు ఏపీలోనే ఎక్కువ

వివాహితులు ఏపీలోనే ఎక్కువ

ఇండియాలోనే అత్యధికంగా వివాహితులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదే లిస్టులో తెలంగాణ ఐదో స్థానంలో ఉంధి. అత్యధికంగా దంపతులున్న ఏపీలో… భర్త లేదా భార్య లేనివారు… లేదా వారికి దూరంగా ఉంటున్న వారు కూడా ఎక్కువే. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వేలో(SRS)-2017 పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. జీవిత భాగస్వామి లేకుండా, లేదా ఒంటరిగా జీవిస్తున్న వారు ఇండియా మొత్తంలో 3.7% మంది ఉండగా, ఏపీలో 5.1% మంది,  తెలంగాణలో 4.7% మంది ఉన్నారు. ఇక దేశం మొత్తం జనాభాలో 46.8% మంది  పెళ్లయిన వారు ఉన్నారు. ఏపీలో 54% మంది వివాహితులు ఉండగా…కేరళలో 51.5%,  తమిళనాడులో 51.2%, పశ్చిమ బెంగాల్‌ లో 51.1% ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల లెక్కల్లోకి వస్తే, ఏపీలో పెళ్లైన వారు 52.5 శాతం మంది పురుషులు ఉండగా… 55.6 శాతం మహిళలు ఉన్నారు. మ్యారేజ్ అయిన వారు తెలంగాణలో 48.1 శాతం మంది పురుషులు, 52.1 శాతం మంది మహిళలు ఉన్నారు. దేశంలోనే అతి తక్కువగా బీహార్‌ లో 41.2% పురుషులకు మాత్రమే పెళ్లిళ్లు అయ్యాయి.

జీవిత భాగస్వామికి దూరమైన వారు దేశం మొత్తంలో 3.7 శాతం మంది ఉండగా… ఏపీలో 5.1 శాతం మంది (పురుషుల్లో 2.4 శాతం, మహిళల్లో 7.9 శాతం) ఉన్నారు. తెలంగాణలో 4.7 శాతం మంది (పురుషుల్లో 2 శాతం, మహిళల్లో 7.6 శాతం) ఉన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోయి లేదా విడిపోయిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు.