వడ్లు కొనాలంటూ రాస్తారోకో.. జగిత్యాల జిల్లా కోరుట్లలో హైవే దిగ్బంధం

వడ్లు కొనాలంటూ రాస్తారోకో.. జగిత్యాల జిల్లా కోరుట్లలో హైవే దిగ్బంధం

కోరుట్ల, వెలుగు: వడ్లను వెంట వెంటనే కొనాలని, తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ జగిత్యాల జిల్లా కోరుట్లలో రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. మెట్‌‌‌‌పల్లి మండలం రామారావుపల్లె, పెద్దాపూర్‌‌‌‌ గ్రామాలకు చెందిన రైతులు కోరుట్లలోని పెద్దగుండు సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలకు రెండు నెలల కింద వడ్లను తీసుకొచ్చినా ఇప్పటివరకు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాలు పేరుతో మిల్లర్లు క్వింటాల్‌‌‌‌కు 15 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని ఆరోపించారు.

అకాల వర్షాలు పడుతుండడంతో వడ్లు తడిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని ఆఫీసర్లకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని పట్టుబడ్డారు. విషయం తెలుసుకున్న మెట్‌‌‌‌పల్లి తహసీల్దార్‌‌‌‌ రైతుల వద్దకు చేరుకొని కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. రాస్తారోకో కారణంగా ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

వడ్లను తగులబెట్టిన రైతులు
నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం, బస్తాలను తరలించేందుకు లారీలు రాకపోవడాన్ని నిరసిస్తూ నల్కొండ జిల్లా నార్కట్‌‌‌‌పల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామంలో రైతులు వడ్ల బస్తాలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు నక్కలపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.