111 జీవో ఉన్నట్టా? లేనట్టా? .. కోర్టుకోమాట, జనానికో మాట చెబుతున్న రాష్ట్ర సర్కారు

111 జీవో ఉన్నట్టా? లేనట్టా? .. కోర్టుకోమాట, జనానికో మాట చెబుతున్న రాష్ట్ర సర్కారు
  • జీవోను ఎత్తివేస్తున్నట్లు గతంలో ప్రకటనకమిటీ రిపోర్ట్ 
  • వచ్చే దాకా అమల్లో ఉంటుందని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు:  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవోపై రాష్ట్ర సర్కారు చెబుతున్న మాటలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ జీవోను ఎత్తివేసినట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం.. హైకోర్టుకు మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. జీవో 111ను ఇంకా ఎత్తివేయలేదని, ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు ఈ జీవోలోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని కోర్టుకు తెలిపింది. దీంతో 111 జీవో ఉన్నట్టా? లేనట్టా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన, చేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతుందోనని భయపడుతున్నారు. భూములు కొన్న వాళ్లు తిరిగి అమ్మేందుకు రెడీ అవుతున్నారు.

కమిటీ రిపోర్టు కోసం వెయిటింగ్ అంటూ..

ఉస్మాన్ సాగర్, హిమాయత్‌‌ సాగర్‌‌ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య కారకాలైన పరిశ్రమలు, హోటళ్లు, నివాస కాలనీల నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు 1996లో 84 గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం జీవో 111 ఇచ్చింది. అయితే ఈ జీవోను ఎత్తివేశామని అసెంబ్లీలో, బయట కూడా స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 111 జీవో ఎత్తివేసి.. దాని స్థానంలో 2022 ఏప్రిల్ 12న జీవో 69ని ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జీవో 111పై దాఖలైన పలు పిటిషన్లను గత నెల 22న హైకోర్టు విచారించింది. ఉన్నత స్థాయి కమిటీ రిపోర్టు వచ్చేంత వరకు జీవో 111లోని షరతులన్నీ అమల్లోనే ఉంటాయని ఈ సందర్భంగా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నివేదిక కోసమే వెయిట్ చేస్తున్నామని 
వివరించింది.

భూములు కొన్నోళ్ల పరిస్థితేంటి?

111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో రియల్ వ్యాపారం భారీగా జరిగింది. ఇక అద్దాల మేడలు, ఆకాశన్నంటే బిల్డింగ్‌లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ రాక ముందు ఇక్కడ ఎకరం రూ.30 లక్షల దాకా ఉండగా, తెలంగాణ వచ్చాక 111 జీవోను రద్దు చేస్తామని మంత్రులు ప్రకటించడంతో ఎకరం ధర రూ.60 లక్షలకు పెరిగింది. తర్వాత ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వరుస ప్రకటనలతో రేట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అజీజ్ నగర్ ప్రాంతంలో ఒక్కో ఎకరం ఏకంగా రూ.12 కోట్లు పలుకుతున్నది. ఇప్పుడేమో జీవో 111ను ఎత్తివేశామని ఒకసారి, లేదు ఇంకా అమల్లో ఉందని ఇంకోసారి రాష్ట్ర సర్కారు చెబుతుండటంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన, చేస్తున్న వారు అయోమయానికి గురవుతున్నారు. అసలు జీవో ఎత్తివేశారా? లేదా? అనే క్లారిటీ లేక ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భూములు కొనుగోలు చేసిన వారు అమ్మేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల తర్వాత పరిస్థితి మారితే 111 జీవోపై ఏం నిర్ణయం తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నారు.

ప్రభుత్వం పూటకోమాట

ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం 111 జీవోపై పూటకోమాట మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నది. జీవో ఎత్తివేశామని ప్రభుత్వం చెప్పడానికి ఏం అధికారం ఉంది. ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టులో విచారణ జరిగితే 111జీవో ఎత్తివేయలేమని చెబుతున్నారు. బయటనేమో జీవో ఎత్తివేశామని, అది తమ ఘనతేనని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల కోసమే అన్నట్లుగా కనిపిస్తున్నది. జీవో ఎత్తివేయడం ఎవరితరం కాదు.

దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

మోసం చేస్తున్నది

తెలంగాణ ప్రభుత్వం 111 జీవో పై ఆటలాడుతున్నది. కోర్టుకి ఒక మాట, ప్రజలకు ఒక మాట చెబుతూ మోసం చేస్తున్నది. అసలు జీవోని ఎత్తి వేయాల్సిన అవసరం ఏముంది? 2000లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే ఫైనల్. జీవో 111 స్థానంలో 69 జీవోని విడుదల చేశారు. అసలు 111 జీవో ఎత్తివేయడం సాధ్యం కాదు. అదే జరిగితే నగరం పూర్తిగా కాలుష్యమయం అయిపోతుంది.

డాక్టర్ లుబ్నా సర్వత్, ఫౌండర్, డైరక్టర్, సెంటర్ ఫర్ వెల్ బీయింగ్ ఎకనామిక్స్, హైదరాబాద్