హిమాయత్ సాగర్‎కు పొటెత్తిన వరద.. 9 గేట్లు ఎత్తివేత

హిమాయత్ సాగర్‎కు పొటెత్తిన వరద.. 9 గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‎తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిటీలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో నగరంలోని రోడ్లన్నీ వరద నీటితో చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎగువ కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్‎కు గురువారం (ఆగస్ట్ 14) వరద పొటెత్తింది. భారీగా వరద నీరు వస్తుండటంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ 9 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‎కి 27 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 9 గేట్లను ఓపెన్ చేసి 9,900 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న మూసీలోకి వదులుతున్నారు. 

హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ 1763.5 ఫీట్లు కాగా.. ప్రస్తుత జలాశయంలో నీటి మట్టం 1762.95 ఫీట్లుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో.. మూసీకి వరద ఉధృతి పెరిగింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం, మూసీకి వరద ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.  వరద ఉధృతి ఎక్కువై మరికొన్ని గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తే.. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వివరాలు:

పూర్తి స్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1762.95 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం : 2.970 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 27 వేల క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 9,900 క్యూసెక్కులు
మొత్తం గేట్ల సంఖ్య : 17
ఎత్తిన గేట్ల సంఖ్య : 9