మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో అన్నకు నిప్పు

మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో  అన్నకు నిప్పు

మెదక్/నిజాంపేట, వెలుగు: మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సొంత అన్నను సజీవ దహనం చేసేందుకు అతని చెల్లెలు, ఆమె కొడుకులు ప్రయత్నించారు. బాధితుడి ఇంటి వాకిట్లోనే చితి పేర్చి.. అతణ్ని అందులో పడుకో బెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గంగుల సుదర్శన్ (62), బాలమణి దంపతులు. సుదర్శన్ సొంత చెల్లెలు భూదేవిది కూడా ఇదే ఊరు. ఆమెకు ముగ్గురు కొడుకులు శేఖర్, సాయికుమార్, భాస్కర్ ఉన్నారు. అయితే సుదర్శన్ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఆయనపై భూదేవి కుటుంబం కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో శనివారం భూదేవి, ఆమె కొడుకులు ముగ్గురు సుదర్శన్ ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. అతనిపై దాడి చేసి కొట్టారు. అనంతరం వాకిట్లో కట్టెలతో చితి పేర్చారు. దానిపై సుదర్శన్​ను పడుకోబెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన పలువురు అక్కడికి వచ్చినప్పటికీ, ఎవరూ ఈ దారుణాన్నిఅడ్డుకునే ప్రయత్నం చేయలేదు. 

పోలీసులు రాకపోతే ప్రాణం పోయేది... 

పాత నేరస్తుల వివరాలను సేకరించడానికి నిజాంపేట పోలీసులు శనివారం చల్మెడకు వెళ్లారు. ఆ టైమ్ లో ఊరిలో ఓ చోట చాలామంది గుమిగూడటం గమనించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లారు. సుదర్శన్ పై పెట్రోల్ పోసి నిప్పంటించడం గమనించిన పోలీసులు... వెంటనే స్పందించి మంటలు ఆర్పి అతని ప్రాణాలు కాపాడారు. గాయాలైన సుదర్శన్ ను రామాయంపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్​కు పంపించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి రాకుంటే సుదర్శన్ ప్రాణాలు పోయేవని గ్రామస్తులు చెప్పారు. బాధితుడి కొడుకు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిందితులు నలుగురిని నిజాంపేట పోలీసులు అదుపులోకి తీసుకొని 
విచారిస్తున్నారు.