- ఉద్యోగ జేఏసీ, సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా చరిత్రాత్మకమని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల నేతలు అన్నారు. రూ.1,056 కోట్ల మూలనిధితో క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కు కేబినెట్ ఆమోదముద్ర వేయడం హర్షణీయమని పేర్కొన్నారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త పథకం ద్వారా రాష్ట్రంలోని 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో 1,998 రకాల వ్యాధులకు నగదు రహిత చికిత్స పొందే అవకాశం రావడం ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప వరమని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. అనంతరం నేతలు మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నెల రోజుల్లోపే ఉద్యోగులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.
టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్టీయూ నుంచి పి.దామోదర్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి చావ రవి, టీఎన్జీవో నేత కె.వెంకటేశ్వర్లు, టీజీవో నుంచి ఉపేందర్ రెడ్డి, ఎస్టీయూ లీడర్జి.సదానందగౌడ్, పెన్షనర్లు, రెవెన్యూ, సెక్రటేరియెట్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్స్, డిప్యూటీ కలెకర్ల సంఘాలు, తెలంగాణ తహసీల్దార్అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్అసోసియేషన్ నాయకులు దామోదర్ రెడ్డి, ఉమాదేవి, వి.రవీందర్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, నిర్మల, దశరథ్ పాల్గొన్నారు.
