రాజపుత్ర శౌర్యానికి ప్రతీక..మేవార్ గద్దెను అధిరోహించిన రాణా ప్రతాపసింహుడు

రాజపుత్ర శౌర్యానికి ప్రతీక..మేవార్ గద్దెను అధిరోహించిన రాణా ప్రతాపసింహుడు

1572లో మేవార్ గద్దెను రాణా ప్రతాప సింహుడు అధిరోహించాడు. సాహసి, యుద్ధవీరుడు, సుక్షత్రియుడు, తన నరాలలో బప్పారావల్ రక్తం ప్రవహిస్తున్న ప్రతాపుడు రాజపుత్ర శౌర్యానికి ప్రతీక. చిత్తోర్​ దుర్గానికి పట్టిన దుర్గతి ఆయన మనసును ఇనుములా మార్చి, ప్రతీకారం తీర్చుకునేలా పురిగొల్పింది. జరిగిందంతా ఆయన ఉన్నత ఆత్మను కలిచి వేసి తన వంశ పరువు ప్రతిష్టలను పునరుద్ధరించాలని ఆయన గట్టిగా అనుకున్నాడు. 

మేవార్ చిన్న రాజ్యం. అక్బర్​ సేనను ఎదిరించడానికి కావాల్సిన వనరులు లేవు. అంబర్, మేవార్, బికనీర్, బుండీ యువరాజులు అతని ముస్లిం శత్రువుకు అనుయాయులయ్యారు. ఆయనకు సాయపడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. తన విలాసాలన్నీ విడిచిపెట్టాడు. దర్భాసనం మీద పడుకున్నాడు. పంచభక్ష్య పరమాన్నములను త్యజించాడు. ఇప్పటిదాకా మేవార్ రాజులు భోజనం చేసే బంగారం, వెండి పళ్లాలను దూరం చేశాడు. యుద్ధాల్లో, ఊరేగింపుల్లోను ధ్వనించే భేరీ శబ్దాలను నిలువరించాడు. 

సుప్రసిద్ధ ఇటలీ దేశ భక్తుడు మాజినీ మాదిరే తన మాతృదేశం కోసం చేసే ఎలాంటి త్యాగమైనా అంత గొప్పదేం కాదు అనుకున్నాడాయన. మొదటగా తన చిన్నరాజ్యాన్ని బలోపేతం చేశాడు. ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరించాడు. కోటలను సక్రమంగా సైన్యంతో నింపి సమర్థులైన అధికారులకు అప్పగించాడు. మొఘల్​లు దాడి చేసినప్పుడు పర్వత ప్రాంతాల్లోకి వెళ్లాల్సిందిగా తన అనుయాయులను ఆజ్ఞాపించాడు. 

గుజరాత్ విజయం తర్వాత అక్బర్​ – రాణాను చూడటానికి రాజా మాన్​ సింహుణ్ణి పంపించాడు. రాణా అతనికి ఘనస్వాగతం పలికాడు. కానీ, సార్వభౌమునితో స్నేహం గురించి అతడు చెప్పిన వాటిని తిరస్కరించాడు. అది మేవార్ – మొఘల్​ వంశాల మధ్య సంబంధానికి గట్టి చురక అని రాజపుత్రులు భావించారు. రాజామాన్​ సింగ్​ కోసం ఆ ప్రదేశాన్ని గంగాజలంతో అభిషేకించారు. 

ముఖ్యులందరూ కూడా మొఘల్​లతో వైవాహిక సంబంధం పెట్టుకున్న మాన్​సింగ్​ రాకతో కలిగిన అపవిత్రతను పోగొట్టుకోవడానికి స్నానాలు చేశారట. ఈ అవమానానికి మాన్​సింగ్ రగిలిపోయాడు. అక్బర్ చక్రవర్తిని, రాణా ప్రతాపుని గర్వాన్ని అణచివేసేందుకు ఒప్పించాడు. కానీ అక్బర్, రాణా తప్పులను ఎప్పటికీ క్షమించలేదు. 

1584లో ఆయన మళ్లీ జగన్నాథ కచవాహుని, జఫర్ బేగ్​ను, రాణాను సంభాళించమని పంపించాడు. కానీ, వాళ్లకు అతణ్ణి అణచివేయటం వృథా ప్రయాస అని తెలుసు. పరిస్థితులు బాగా అనుకూలించాయి. అక్బర్​ పంజాబ్​ దగ్గర చాలా సంవత్సరాల వరకు నిలువరించబడ్డాడు. అప్పటి వాయువ్య సరిహద్దుల్లో నెలకొని ఉన్న చిక్కుల వల్ల ఆయనకు మేవార్ గురించి పట్టించుకునే తీరికలేకపోయింది. రాణా ప్రతాప్​ తన స్థావరాలన్నింటినీ తిరిగి వశపరచుకుని 1597లో అజేయుడుగా మరణించాడు. 

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-