సెల్యూట్ నీరజ్: నిజమైన సోల్జర్‌‌లా పోరాడావ్

సెల్యూట్ నీరజ్: నిజమైన సోల్జర్‌‌లా పోరాడావ్

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన యువ కెరటం నీరజ్‌ చోప్రా (23)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు అతడిని మెచ్చుకున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్.. యావత్ దేశ యువతను ఇన్‌స్పైర్ చేశాడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. గోల్డ్ మెడల్ సాధించే బాటలో ఉన్న అడ్డంకులను నీ జావెలిన్ చీల్చుకుంటూ వెళ్లిందని ఆయన కీర్తించారు. టోక్యోలో కొత్త చరిత్రను లిఖించావంటూ నీరజ్‌ను ప్రధాని మోడీ అభినందించారు. ఈ రోజు నీరజ్ సాధించిన విజయం అప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.

భారత్ ఆర్మీ గర్విస్తోంది

ఆర్మీలో సుబేదార్ కేడర్‌‌లో పని చేస్తున్న నీరజ్ చోప్రాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కంగ్రాట్స్ చెప్పారు. నీరజ్ సాధించిన గోల్డెన్ విక్టరీ యావత్ దేశాన్ని, భారత ఆర్మీని గర్వింపజేస్తోందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ నిజమైన సోల్జర్‌‌లా పోరాడాడని చెప్పారు.