
మునుగోడు, వెలుగు: సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ఆంధ్రోళ్లకు దోచిపెడుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్.. ఎనిమిదేండ్లుగా నియంత పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. 1,300 మంది యువకులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ పాలనను బొందపెట్టాలని, ఈ ఉప ఎన్నిక తీర్పుతో చరిత్ర తిరగరాయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మునుగోడు మండలం మునుగోడు, కొరటికల్, సింగారం, ఉకోండి, కచిలాపురం, కొంపల్లి గ్రామాల్లో రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మునుగోడుకు మూడున్నరేండ్లు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన కేసీఆర్.. తన రాజీనామాతో దిగొచ్చి అభివృద్ధి పనులు చేపట్టారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అసెంబ్లీలో మునుగోడు గోడును వినిపించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేశానని, దాంతో ఫామ్‌హౌస్‌లో పడుకున్న కేసీఆర్ మునుగోడుకు వచ్చారన్నారు. వందల ఎకరాలున్న భూస్వాములకు కాకుండా కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆయా గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, దర్శనం వేణు కుమార్ తదితరులు పాల్గొన్నారు.