జమ్ము బ్లాస్ట్ హిజ్బుల్ పనే: నిందితుడి అరెస్ట్

జమ్ము బ్లాస్ట్ హిజ్బుల్ పనే: నిందితుడి అరెస్ట్

జమ్ము బస్టాండ్ లో గ్రెనేడ్ పేలుడు కేసును కొన్ని గంటల్లోనే జమ్ము కశ్మీర్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం ఉదయం జమ్ము బస్టాండ్ లో ఆగి ఉన్న ఓ బస్సులో గ్రెనేడ్ పేలి.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారిలో ఒకరు మరణించారు.  ప్రత్యేక టీమ్స్ గా ఏర్పడి ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల సహకారంతో సాయంత్రం 4 గంటల సమయంలోనే నిందితుడిని అరెస్టు చేశారు.

బస్సుపై గ్రెనేడ్ విసిరి పరార్

యాసిర్ భట్

ఈ ఘటనకు కారణం హిజ్బుల్ మొజాహిద్దీన్ ఉగ్ర సంస్థ అని పోలీసులు కనిపెట్టారు. కుల్గాం జిల్లా హిజ్బుల్ కమాండర్ ఫరూక్ అహ్మద్ భట్ అలియాస్ ఒమర్ ఈ దాడికి సూత్రదారి అని ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. యాసిర్ భట్ అనే ఉగ్రవాదిని దీని కోసం వినియోగించాడని చెప్పారు. ఉదయం నుంచి భావిస్తున్నట్లుగా గ్రెనేడ్ ను బస్సు కింద పెట్టలేదు. యాసిర్ భట్ బస్సుపై గ్రెనేడ్ ను విరిసి పరారయ్యాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి అతడిని అరెస్టు చేశారు పోలీసులు. అతడిని విచారించగా.. దాడి చేసింది తానేనని ఒప్పుకున్నాడని చెప్పారు సిన్హా.

మృతుడికి రూ.5 లక్షల పరిహారం

జమ్ము బస్టాండ్ లో గ్రెనేడ్ దాడిని జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ ఖండించారు. ఈ ఘటనలో మరణించిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.20 వేలు పరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు.

మరో నలుగురి పరిస్థితి విషమం

ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కు చెందిన మహమ్మద్ షారిక్ (17)గా గుర్తించారు. గ్రెనేడ్ పేలుడు జరిగిన సమయంలో దగ్గరగా ఉండడంతో అతడికి గుండె భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.