మంచు తుఫాను దెబ్బకు.. రెస్టారెంట్ ఇలా మారింది

మంచు తుఫాను దెబ్బకు.. రెస్టారెంట్ ఇలా మారింది

మీరు ఫొటోలో చూస్తున్నది మంచుదిబ్బ కాదు !!  మంచుయుగం నాటి ఇల్లు ఎంతమాత్రం  కానే కాదు!!

ఇది అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం  హ్యాంబర్గ్ టౌన్ పరిధిలో ఉన్న  విఖ్యాత రెస్టారెంట్. 

‘హోక్స్ రెస్టారెంట్’ (Hoak's Restaurant)  అంటే.. న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో వెరీవెరీ ఫేమస్.  

వీఐపీలు, సెలెబ్రిటీలు, టూరిస్టులతో నిత్యం సందడిగా ఉండే ఈ రెస్టారెంట్ ఇప్పుడు ఇలా తయారైంది. ఎందుకు అని అనుకుంటున్నారు. మరేం లేదు.. ఇటీవలకాలంలో అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. దాని ధాటికే ‘హోక్స్ రెస్టారెంట్’ రూపురేఖలు ఇలా మారిపోయాయి. అమెరికాలోనే నాలుగో అతిపెద్ద సరస్సు ‘లేక్ ఎరీ’ తీరంలో హోక్స్ రెస్టారెంట్ ఉంది. సరస్సు తీరంలో ఉండటం ఈ రెస్టారెంట్ పాలిట ప్రతికూలంగా పరిణమించింది. మంచు తుఫాను ప్రభావం దీన్ని తీవ్రంగా కుదిపేసింది.  మంచు దుప్పటితో దట్టంగా కప్పేసింది. దీంతో గత కొన్ని వారాలుగా ఇది మూతపడి ఇలాగే ఉండిపోయింది. మరోవైపు హ్యాంబర్గ్ టౌన్ లోని ఇండ్లు, రోడ్లన్నీ మంచు దుప్పట్లోనే ఉన్నాయి. వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థకు అంతరాయం వాటిల్లింది. జనజీవనం స్తంభించింది.

ఈనేపథ్యంలో  హోక్స్ రెస్టారెంట్ మళ్లీ తెరుచుకునేందుకు ఇంకొన్ని వారాల సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   సరస్సు ఒడ్డున ఉండటం వల్ల సాధారణ తుఫానులైనా, మంచు తుఫానులైనా ఏవి వచ్చినా ఈ రెస్టారెంట్ ఏటా ఇదే విధంగానే ప్రభావితం అవుతోంది. అయినా మళ్లీ తెరుచుకొని కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది. హోక్ రెస్టారెంట్ మంచు సౌధంగా మారిపోయింది అనే కామెంట్ తో ఓ నెటిజన్ ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ ను స్వయానా న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ రీట్వీట్ చేశారు. ‘మంచు తుఫాను పరిస్థితులను అద్దంపట్టేలా హోక్ రెస్టారెంట్ దృశ్యాలు ఉన్నాయి’ అని ఆమె కామెంట్ చేశారు.  దీంతో మంచుదుప్పట్లో ఉన్న హోక్స్ రెస్టారెంట్ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.  

రెస్టారెంట్ చరిత్ర

హోక్స్ రెస్టారెంట్ ను 1949 నవంబరులో ఎడ్వర్డ్ హోక్, బెర్టాండ్ హోక్ అనే ఇద్దరు అన్నదమ్ములు ప్రారంభించారు. వాళ్ల ఇంటిపేరు మీదే దీనికి ‘హోక్స్’ అనే పేరు పెట్టారు. అంటే ఇది ప్రారంభమై 73 ఏళ్లు గడిచాయన్న మాట.  1977 సెప్టెంబరులో ఈ రెస్టారెంట్ ను ఎడ్వర్డ్ హోక్ ఇద్దరు  కుమారులు కలిసి.. బెర్టాండ్ హోక్ నుంచి కొనేశారు. ప్రస్తుతం వారే దీన్ని నడిపిస్తున్నారు.