Asia Cup 2025 Hockey: 8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం.. భారత జట్టుకు హాకీ ఇండియా ప్రైజ్ మనీ ప్రకటన

Asia Cup 2025 Hockey: 8 ఏళ్ళ తర్వాత ఆసియా కప్ సొంతం.. భారత జట్టుకు హాకీ ఇండియా ప్రైజ్ మనీ ప్రకటన

ఇండియా హాకీ జట్టు 2025 ఆసియా కప్‌‌‌‌ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం (సెప్టెంబర్ 7) కొరియాపై జరిగిన టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో మన జట్టు 4–1తో అద్భుత విజయం సాధించింది. ఎనిమిదేండ్ల విరామం తర్వాత టీమిండియా ఆసియా కప్‌‌‌‌ గెలవడం విశేషం. ఓవరాల్ గా భారత హాకీ జట్టు నాలుగుసార్లు హాకీ ఆసియా కప్ ను అందుకుంది. అంతకముందు 2003, 2007, 2017లో ఛాంపియన్ గా నిలిచింది. ఈ టోర్నీలో ఐదు విజయాలు, ఒక డ్రాతో అపజయమన్నదే లేకుండా ఆడిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి డిఫెండింగ్ ఛాంపియన్ కొరియాను చిత్తు చేసింది. 

2025 హాకీ ఆసియా కప్ గెలిచిన తర్వాత.. హాకీ ఇండియా భారత జట్టుకు నజరానా ప్రకటించింది. భారత్ జట్టులోని ప్రతి ఆటగాడికి మూడు లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందజేస్తామని ప్రకటించింది. సపోర్టింగ్ స్టాఫ్ లో ఉన్న ప్రతి సభ్యునికి లక్షన్నర అందిస్తామని తెలిపింది. "బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన హీరో ఆసియా కప్ 2025లో ఇండియా చారిత్రాత్మక విజయం సాధించి నాలుగో సారి ఆసియా కప్ గెలుచుకుంది. హాకీ ఇండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు, సపోర్టింగ్ స్టాఫ్ కు రూ. 1.5 లక్షల రివార్డులను ప్రకటించడం ఆనందంగా ఉంది" అని ఆసియా కప్ విజయం తర్వాత హాకీ ఇండియా ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.

ALSO READ : రెండేళ్లకే టీమిండియా ఆల్‌టైమ్ రికార్డ్ చెరిపేసిన ఇంగ్లాండ్..

ఆసియా కప్ ఫైనల్లో కొరియాపై ఇండియా పూర్తి ఆధిపత్యం చూపించింది. భారత్ మొదటి నిమిషం నుంచే మన జట్టు అటాకింగ్ గేమ్ ఆడింది. ఈ క్రమంలో మొదటి అర్ధభాగంలో గోల్ చేసింది. రెండవ క్వార్టర్‌లో దిల్‌ప్రీత్ మరో గోల్ చేసి టీమిండియాను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇదే ఊపులో మూడో క్వార్టర్ లో దిల్‌ప్రీత్ భారత్ తరపున మూడో గోల్ చేసి 3-0 ఆధిక్యాన్ని అందించాడు. నాల్గవ క్వార్టర్ ప్రారంభంలో అమిత్  రోహిదాస్ గోల్ చేయడంతో 4-0 ఆధిక్యం సంపాదించి పటిష్ట స్థితిలో నిలిచింది. నాల్గవ క్వార్టర్ చివరిలో, కొరియా ఒక గోల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. మూడో ప్లేస్‌‌‌‌ కోసం జరిగిన మ్యాచ్‌‌‌‌లో మలేసియా 4–3తో చైనాను ఓడించింది. ఐదో ప్లేస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో జపాన్‌‌‌‌ 6–1తో బంగ్లాదేశ్‌‌‌‌పై గెలిచింది.