
- ఆమెకు 95%..తోటి విద్యార్థికి 70% కాలిన గాయాలు
- ఒడిశాలోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఘటన
భువనేశ్వర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో దారుణం జరిగింది. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిని డిపార్ట్ మెంట్ హెడ్(హెచ్ఓడీ) సమీర్ రంజన్ సాహు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అతని వేధింపులు భరించలేని విద్యార్థిని కాలేజీ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. దాంతో ఆమె 95 శాతం కాలిపోయింది. బాధితురాలని కాపాడేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థికి కూడా 70% కాలిన గాయాలయ్యాయి.
ఇద్దరూ ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సాహు సదరు విద్యార్థినిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరించాడు. దాంతో విద్యార్థిని ఈ నెల 1న కాలేజీ ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌కు ఫిర్యాదు చేసింది. వారంలో చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతో బాధిత విద్యార్థిని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా కాలేజీ క్యాంపస్‌లో నిరసన చేస్తున్నది. శనివారం ఉదయం కూడా తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగింది.
ఒక్కసారిగా ప్రిన్సిపాల్ ఆఫీస్ ముందుకు పరుగెత్తిన ఆమె.. పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకుంది. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ పరుగెత్తుతున్న విద్యార్థినిని.. తోటి విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థికి మంటలు అంటుకున్నాయి. దాంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు సాహును అదుపులోకి తీసుకోగా.. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. కాలేజీ అంతర్గత కమిటీ విచారణలో జాప్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.