ఇంటి వద్దే టెస్ట్, ట్రీట్ మెంట్బాలికల్లో తగ్గిన రక్తహీనత..టెస్టులు చేసి మందులిస్తే మంచి రిజల్ట్ ..

ఇంటి వద్దే టెస్ట్, ట్రీట్ మెంట్బాలికల్లో తగ్గిన రక్తహీనత..టెస్టులు చేసి మందులిస్తే మంచి రిజల్ట్  ..
  •      సంప్రదాయ పద్ధతుల కంటే స్టార్ విధానమే బెటర్ అంటున్న సైంటిస్టులు
  •      మేడ్చల్ జిల్లాలో 14 గ్రామాల్లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ స్టడీ రిపోర్ట్ లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశంలో 50 శాతానికి పైగా మహిళలను వేధిస్తున్న రక్తహీనత (ఎనీమియా) సమస్యకు చెక్ పెట్టేందుకు నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) చేసిన ఒక కొత్త ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. సాధరాణంగా ఎనిమియా సమస్య హాస్పిటల్ కు ఏదైనా అనారోగ్య సమస్యతో వెళ్లినప్పుడు మాత్రమే బయటపడుతుంది. కానీ, ఎన్ఐఎన్ సైంటిస్టులు మాత్రం స్క్రీన్ అండ్ ట్రీట్ పద్ధతి ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి స్ర్నీనింగ్ టెస్టులు చేసి సమస్యను గుర్తించారు. సమస్య ఉన్నవారికి అక్కడే మందులు అందించి ఎనీమియా సమస్యను తగ్గించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ఐసీఎంఆర్--ఎన్ఐఎన్ డైరెక్టర్ భారతీ కులకర్ణి, సైంటిస్ట్ రఘు పుల్లఖండం నేతృత్వంలోని టీమ్ రాష్ట్రంలోని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఈ ప్రయోగం నిర్వహించింది. మొత్తం 14 గ్రామాలను ఎంచుకున్నారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించి,  ఒక గ్రూపులో 6,131 మందికి కొత్త పద్ధతిలో (స్క్రీన్ అండ్ ట్రీట్) ట్రీట్మెంట్ అందించారు. మరో గ్రూపులో 5,255 మందిని సాధారణ ప్రభుత్వ వైద్య విధానంలో ఉంచి పర్యవేక్షించారు. 6 నెలల పిల్లల నుంచి 50 ఏండ్ల వయసున్న మహిళలు, పురుషులు ఇందులో పాల్గొన్నారు. ప్రాజెక్టు వివరాలు ఇటీవలే బీఎంజే గ్లోబల్ హెల్త్ - జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.  

ఇండ్ల వద్దే పరీక్షలు, మందులు

సాధారణంగా హాస్పిటల్స్ కు వెళ్తేనే రక్తహీనత పరీక్షలు చేస్తారు. అంగన్వాడీల ద్వారా ఐరన్ టాబ్లెట్లు ఇస్తుంటారు. కానీ, ఈ ప్రయోగంలో హెల్త్ వర్కర్లు నేరుగా ప్రజల ఇండ్ల వద్దకే వెళ్లారు. పోర్టబుల్ ఆటో అనలైజర్ల సాయంతో అప్పటికప్పుడే రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించారు. రిపోర్ట్ ఆధారంగా ఎవరికి ఎంత మోతాదులో మందులు అవసరమో నిర్ధారించి.. వెంటనే ఆ ఇంటికి 3 నెలలకు సరిపడా మందులను అందించారు. 

రక్తహీనత లేని వారికి కూడా ముందు జాగ్రత్తగా తక్కువ మోతాదులో మందులు ఇచ్చారు. ఈ కొత్త విధానం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చిందని ప్రయోగంలో తేలింది. 10 నుంచి 19 ఏండ్ల వయసున్న కిశోర బాలికల్లో రక్తహీనత చాలావరకు తగ్గింది. వీరిలో హిమోగ్లోబిన్ స్థాయిలు 0.73 g/dL మేర పెరిగాయి. 

ఎనీమియా శాతం 15.3శాతం మేర తగ్గింది. గర్భధారణ వయసు కలిగిన మహిళల్లో కూడా రక్తహీనత 4.4% మేర తగ్గింది. మొత్తంగా చూస్తే.. సాధారణ ట్రీట్మెంట్ తీసుకున్న వారికంటే..  ఇంటి వద్దే పరీక్షలు చేసి మందులు ఇచ్చిన వారిలోనే ఎనీమియా తీవ్రత తగ్గింది. మోడరేట్ ఎనీమియా ఉన్నవారిలో ఇది బాగా పనిచేసిందని స్టడీలో తేలింది.

మందులు వాడటంలో నిర్లక్ష్యం.. 

ఈ స్టడీలో మరో ఆందోళనకరమైన విషయం కూడా బయటపడింది. మందులు ఇంటికి తెచ్చి ఇచ్చినా.. జనం వాటిని వేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తేలింది. కేవలం 32శాతం మంది మాత్రమే ట్రీట్మెంట్ కు సరిపడా మందులను పూర్తిగా వాడారు. సైడ్ ఎఫెక్ట్స్ భయం, వికారం, వాంతులు అవుతాయన్న కారణంతో చాలామంది మధ్యలోనే మందులు మానేశారు. 

అయినప్పటికీ..  వాడిన వారిలో మాత్రం మంచి రిజల్ట్ కనిపించింది. ఐదేండ్లలోపు పిల్లలు, మగవారిలో మాత్రం ఈ విధానం పెద్దగా మార్పు చూపించలేదు. మగవారిలో సహజంగానే రక్తహీనత తక్కువగా ఉండటం, ఇతర కారణాల వల్ల పెద్దగా ఇంపాక్ట్ కనిపించలేదని పరిశోధకులు భావిస్తున్నారు.

ప్రభుత్వాలు అవలంబిస్తున్న పద్ధతికంటే...స్టార్ పద్ధతి బెటర్

కేవలం హాస్పిటల్స్ కే పరిమితం కాకుండా.. ప్రజల వద్దకే వెళ్లి స్క్రీన్ అండ్ ట్రీట్ పద్ధతిని అమలు చేస్తే.. మన దేశంలో ఎనీమియాను తగ్గించడం సాధ్యమేనని ఈ స్టడీ స్పష్టం చేసింది. ముఖ్యంగా యుక్తవయసు బాలికలు, మహిళలపై ప్రత్యేక దృష్టి పెడితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మందులు వేసుకునేలా ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఈ ప్రయోగం స్పష్టం చేసింది.

బంగారు భవిష్యత్ కు.. ఇంటింటి స్క్రీనింగ్ అవసరం

మా స్టడీలో 15 శాతం కిశోర బాలికల్లో ఎనీమియా తగ్గింది. అంటే.. ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేస్తే చాలా మందిలో సమస్యను గుర్తించవచ్చు. సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ అందిస్తే.. రేపటి తల్లులు, వారికి పుట్టబోయే పిల్లలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. ఆరోగ్య కరమైన భారత్ కావాలంటే.. ఇంటింటికి తిరిగి చేసే స్టార్ ట్రీట్మెంట్ అవసరం. 
- డాక్టర్ భారతీ కులకర్ణీ,  డైరెక్టర్, ఐసీఎంఆర్- ఎన్ఐఎన్

మందుల విషయంలో భయం అక్కర్లేదు.. 

చాలా మంది మందులు వాడటంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి కారణం వాళ్లలో ఉండే అపోహలే అని గుర్తించాము. ప్రజలకు ఆ అపోహలు అక్కర్లేదు.  పెద్దలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్, పిల్లలకు సిరప్ వాడినప్పుడు కొంతమందికి మొదటి ఒకటి రెండు రోజులు కడుపులో కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఆ తరువాత అలవాటై పోతుంది. సమస్య ఉన్నవారు 90 రోజులు మందులు వాడితే..  నయం అవుతుంది. 
- డాక్టర్ రఘు పుల్లఖండం,  సైంటిస్ట్, ఐసీఎంఆర్-ఎన్ఐఎన్