హోంగార్డు నయవంచన..యువతిని గర్భవతిని చేసి.. ఆర్ఎంపీతో అబార్షన్

హోంగార్డు నయవంచన..యువతిని గర్భవతిని చేసి.. ఆర్ఎంపీతో అబార్షన్
  • రక్తస్రావం కావడంతో బాధితురాలు మృతి..
  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఘటన

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో దారుణం జరిగింది. ఓ హోంగార్డు ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి గర్భవతిని చేయడం కాకుండా..  ఆర్ఎంపీతో అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా షారుఖ్ నగర్ మండలం రాయ్‌‌కల్ గ్రామానికి చెందిన మౌనిక (29) ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతోంది. 

శంషాబాద్ పీఎస్​ ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డుగా పనిచేస్తున్న ముచ్చింతల్​కు చెందిన మధుసూదన్‌‌ ఏడేండ్ల కింద ఆమెకు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో లోబరుచుకుని పెండ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడు. నాలుగు రోజుల కింద బాధిత యువతి గర్భవతి అని తెలుసుకున్నాడు. 

అబార్షన్ కోసం మంగళవారం పాలమాకులలోని ఆర్ఎంపీ పద్మజ వద్దకు తీసుకెళ్లాడు. అబార్షన్ తర్వాత బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన ట్రీట్మెంట్​కోసం నగరంలోని పెద్ద హాస్పిటల్ కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. 

ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో శంషాబాద్ పోలీసులు నిందితుడు మధుసూదన్ తోపాటు అబార్షన్ చేసిన ఆర్ఎంపీ పద్మజను అరెస్ట్ చేశారు. మౌనిక డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.