
- ఉన్నతాధికారుల ఛాంబర్స్ వద్ద పీటీ డ్రెస్‌తో విధులు
- రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు : హోంగార్డులు కొత్త డ్రెస్‌లో కనిపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో యూనిఫామ్‌కు బదులు ఫిట్టింగ్ ట్రాన్స్‌పోర్ట్(పీటీ)డ్రెస్‌లో డ్యూటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆఫీసుల్లో అమలులోకి వచ్చిన ఈ డ్రెస్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హౌస్ సర్వీస్ చేసే హోంగార్డులకు టీషర్ట్‌తో కూడిన పీటీ డ్రెస్ అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ముందుగా బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ విధానం అమల్లోకి తెచ్చారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీస్, సిటీ ట్రాఫిక్ చీఫ్ ఆఫీస్ సహా జాయింట్ సీపీల ఛాంబర్స్ వద్ద హోంగార్డులు కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. అధికారులను కలిసేందుకు వచ్చే వారితో ప్రొఫెషనల్ ఉద్యోగి తరహాలో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అధికారుల కార్యాలయాల వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఖాకీ యూనిఫామ్‌కు బదులు పీటీ డ్రెస్ వేసుకుంటున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 6000 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు.
వీరిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగాల్లో గ్రౌండ్ డ్యూటీలు చేసే హోంగార్డులు మ్యాన్యువల్ ప్రకారం రెగ్యులర్ యూనిఫామ్‌లోనే పనిచేస్తున్నారు. ఇందుకు కారణం పబ్లిక్ సర్వీస్‌లో ఉండే పోలీస్ అని గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. అయితే అధికారులే కాకుండా కానిస్టేబుల్స్ కూడా హోంగార్డులను తమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఆ సమయంలో ఖాకీ యూనిఫామ్‌తో హోంగార్డులు ఇబ్బంది పడతున్న ఘటనలు ఉన్నాయి. అందుకే వారికి పీటీ డ్రెస్ అమలు చేయబోతున్నట్లు తెలుస్తున్నది.
సంతోషంగా ఉంది
‘‘పీటీ డ్రెస్ మా విధులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్ డ్యూటీ చేసే సమయంలో టీ షర్ట్ డిగ్నిటీగా అనిపిస్తున్నది. మా ఆఫీసర్స్‌ను కలిసేందుకు వచ్చే వారు మాతో కొంచెం మర్యాదగానే మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం మమ్మల్ని హోంగార్డులుగా భావించడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మాకు చాలా సంతోషంగా ఉంది’’
మహ్మద్ జాఫర్ అలీ, హోంగార్డ్, సిటీ జాయింట్ సీపీ ఆఫీస్