
- మూడు క్లస్టర్ల మీటింగ్ లలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి
- ఈ నెలాఖరున జరగాల్సిన మోదీ సభలు రద్దు
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం స్పీడప్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు అయింది. మూడు లేదా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్ గా.. రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ సెగ్మెంట్లను ఐదు క్లస్టర్లుగా విభజించారు. అమిత్ షా ఒక్క రోజే మూడు క్లస్టర్ మీటింగ్ లలో పాల్గొననున్నారు. మొదట కరీంనగర్ క్లస్టర్లో ఆ తర్వాత మహబూబ్ నగర్ క్లస్టర్ పరిధిలో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీల సమావేశానికి హాజరవుతారు.
అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మేధావుల సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన రెండు క్లస్టర్ల మీటింగ్ లు వచ్చే నెలలో జరగనున్నాయి. వాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇది వరకు ప్రకటించిన ప్రధాని మోదీ రెండు సభలు రద్దయ్యాయి. వాటి స్థానంలో అమిత్ షా క్లస్టర్ మీటింగ్ లు ఖరారయ్యాయి.