బీజేపీతో దోస్తీ కుదరదు.. కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతం : మహమూద్​ అలీ

బీజేపీతో దోస్తీ కుదరదు.. కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతం : మహమూద్​ అలీ
  • ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే
  • మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో  హోం మంత్రి మహమూద్​ అలీ

హుస్నాబాద్​, వెలుగు : ముస్లింలకు బీజేపీతో దోస్తీ కుదరదని, కాంగ్రెస్​ను నమ్మితే మోసపోతారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్​అలీ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.  ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న బీజేపీకి దూరంగా ఉండాలన్నారు.  అదే సమయంలో కాంగ్రెస్​ను నమ్మవద్దన్నారు. ముస్లింల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నది కేసీఆరే అన్నారు. హుస్నాబాద్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థి వొడితల సతీశ్​కుమార్​ను గెలిపిస్తే కేసీఆర్​ను గెలిపించినట్టేనన్నారు.

కేసీఆర్​ మైనార్టీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్​ పాలనలో ముస్లింలు ఓటు బ్యాంకుగానే ఉన్నారని, వారి సంక్షేమాన్ని ఆ పార్టీ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్​ మైనార్టీలకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారన్నారు. గురుకుల పాఠశాలలు, విదేశాలకు వెళ్లాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.  

షాదీ ముబారక్​ ద్వారా పేద ఆడపిల్లల తల్లిదండ్రుల బాధలు పోగొట్టారన్నారు. బీఆర్‌‌ఎస్‌ ముస్లింల ఇంటి పార్టీ అన్నారు.  సతీశ్​కుమార్​ను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఆయన ముస్లింల కోసం హుస్నాబాద్​లో ఎన్నో పనులు చేశారన్నారు. కెప్టెన్ లక్ష్మీ కాంతారావు సైనికుడిగా, రాజకీయ నాయకుడిగా, మానవతావాదిగా ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు.