మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులపై అంశంపై పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... మహిళల భద్రత విషయంలో  హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉందని, ఈ విషయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.  పోలీస్ కమిషనరేట్లు, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి పొందిన లైసెన్స్‌ల ఆధారంగా పబ్‌లు, బార్‌లు మొదలైనవాటిని నడుపుతున్నామని, ఇందులో పోలీసుల పాత్ర సున్నా అని మహమూద్ అలీ అన్నారు.  కొన్ని ఆంక్షలు లేదా నియంత్రణ ఉల్లంఘనలను అమలు చేస్తున్నప్పుడు చట్టపరమైన వివాదాలు తలెత్తకుండా పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు హోం మంత్రి తెలిపారు. విద్యా సంస్థలు, పాఠశాలలు యాజమాన్యాల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సీఐడీ డీజి గోవింద్ సింగ్, సీపీ సీవీ ఆనంద్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.