గృహిణి సేవలను డబ్బుతో వెలకట్టలేం..ఉద్యోగం చేసేవాళ్ల కంటే తక్కువేం కాదు

గృహిణి సేవలను డబ్బుతో వెలకట్టలేం..ఉద్యోగం చేసేవాళ్ల కంటే తక్కువేం కాదు

న్యూఢిల్లీ: గృహిణి సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్యోగం చేసే కుటుంబసభ్యుల లాగే, గృహిణి పాత్ర కూడా కీలకమని తెలిపింది. ఓ యాక్సిడెంట్ కేసులో పరిహారం విషయమై కోర్టు ఈ కామెంట్లు చేసింది. ఉత్తరాఖండ్ లో 2006లో జరిగిన యాక్సిడెంట్ లో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె ప్రయాణించిన వెహికల్ కు ఇన్సూరెన్స్ లేకపోవడంతో, ఆ వెహికల్ ఓనర్ నుంచి పరిహారం ఇప్పించాలని బాధితురాలి ఫ్యామిలీ ట్రిబ్యునల్ కు వెళ్లింది. రూ.2.5 లక్షలు చెల్లించాలని ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ అంతకంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లారు. 

ALSO RAED : దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ‘‘చనిపోయిన మహిళ ఒక గృహిణి. ఆమె ఆయుర్దాయం, కనీస ఆదాయం ఆధారంగా పరిహారం నిర్ణయిస్తారు” అని పేర్కొంటూ 2017లో పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ  విశ్వనాథన్ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయాన్ని బెంచ్ తప్పుబట్టింది. ‘‘ఒక గృహిణి సేవలను డబ్బుతో వెలకట్టలేం. ఉద్యోగం చేసి సంపాదించే కుటుంబసభ్యుల లాగే, గృహిణి పాత్ర కూడా కీలకం. గృహిణి చేసే పనులను ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ పోతే, ఆమె అందించే సేవలు అమూల్యమైనవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు” అని పేర్కొంది. బాధిత కుటుంబానికి ఆరు వారాల్లోగా రూ.6 లక్షలు చెల్లించాలని వెహికల్ ఓనర్ ను ఆదేశించింది.