దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్

దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్
  • దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం నవీన్ పట్నాయక్
  • యోగికి రెండో స్థానం,మూడో ప్లేస్​లో హిమంత
  • మూడ్ ఆఫ్​ ది నేషన్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. 22 ఏండ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న పట్నాయక్.. 52.7 శాతం రేటింగ్​తో టాప్ ప్లేస్​లో నిలిచారు. ఎలాంటి వివాదాల జోలికి పోని వ్యక్తిగా పేరున్న ఆయనకే ప్రజలు ఎక్కువ శాతం రేటింగ్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 51.3 రేటింగ్​తో రెండో ప్లేస్ దక్కింది.

ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​నాథ్ మఠంలో ప్రధాన పూజారి అయిన యోగి 2017లో ఉత్తరప్రదేశ్​కు సీఎం అయ్యారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి యూపీ పగ్గాలు చేపట్టారు. దీంతో ఉత్తరప్రదేశ్​లో అత్యధిక కాలం సీఎంగా కొనసాగుతున్న వ్యక్తిగా యోగి రికార్డుకెక్కారు. 48.6 శాతం ఓటింగ్​తో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ మూడో స్థానంలో ఉండగా, 42.6 శాతం రేటింగ్​తో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్​ నాలుగో ప్లేస్​లో ఉన్నారు. ఆదివారం విడుదలైన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

బెంగాల్ సీఎంకు 9, ఢిల్లీ సీఎంకు 10వ ప్లేస్.. 

త్రిపుర సీఎం మాణిక్ సాహాకు ఈ సర్వేలో 41.4 శాతం పాపులారిటీ రేటింగ్ దక్కింది. అత్యంత ప్రజాదరణ పొందిన లిస్ట్ లో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. 2016లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సాహా.. 2020లో పార్టీ రాష్ట్ర చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. 2022లో త్రిపుర సీఎంగా రెండోసారి ప్రమాణం చేశారు. గడిచిన 25 ఏండ్లలో తామెన్నడూ చూడని అభివృద్ధి కార్యక్రమాలు మాణిక్ సాహా వచ్చాకే చూశామని సర్వే సందర్భంగా ఓటర్లు చెప్పినట్లు రిపోర్టు పేర్కొంది.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ 41.1శాతం రేటింగ్​తో ఆరో ప్లేస్​లో, ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్ ధామి 40.1 శాతం ఓటింగ్​తో ఏడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు ఓటర్లు 8వ స్థానం కట్టబెట్టారు. సర్వేలో ఆయనకు 36.5 శాతం రేటింగ్ వచ్చిందని రిపోర్టు వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ 35.8 శాతం రేటింగ్​తో 9వ స్థానంలో ఉండగా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 32.8 శాతం ఓట్లతో 10 వ స్థానంలో నిలిచారు.