
ముంబై: కరోనా వైరస్ కు ముందస్తు నివారణ చర్యగా జనానికి ఇమ్యూనిటీని పెంచే హోమియోపతి మందు ఆర్సెనికమ్ ఆల్బమ్ 30ని వాడేందుకు మహారాష్ట్ర సర్కారు అనుమతించింది. ఆగస్త్య హరీతకి, ఆయుష్ 64, సీసేమ్ ఆయిల్ వంటి యునానీ, ఆయుర్వేదిక్ మందులను వాడేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 55 ఏళ్లుపైబడిన వ్యక్తులను గుర్తించి, ఆర్సెనికమ్ ఆల్బమ్ 30ని పంపిణీ చేసే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
ఆర్సెనికమ్ తో హైదరాబాద్ లో ట్రయల్..
కరోనా నుంచి ఆర్సెనికమ్ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుందా? లేదా? అన్నది తేల్చేందుకు దేశంలోని ఆరు సిటీల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఆయుష్ మినిస్ట్రీ ఇంతకుముందే వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, సూరత్, హైదరాబాద్, మచిలీపట్నంలలో క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి(సీసీఆర్ హెచ్)కు ఆమోదం కూడా లభించిందని తెలిపింది. ప్రజలకు ముందస్తుగా పెద్ద ఎత్తున నివారణ మందు (మాస్ ప్రొఫైలాక్సిస్) ఇవ్వడం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చా? అనేది ఈ ట్రయల్స్ లో తేలనుందని ఆయుష్ మినిస్ట్రీ చెప్పింది.
సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు..
ఆర్సెనికమ్ ఆల్బమ్ 30 మందు కరోనా ఇన్ఫెక్షన్ను నివారిస్తుందనడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఈ మందును శ్వాస సంబంధ సమస్యలకు వాడుతున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా, ఈ మందును కరోనాకు వాడటంపై పలువురు హోమియోపతి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిని ముందుగా మే నెలలో ముంబైలోని 2 కంటైన్ మెంట్ జోన్లలో పంపిణీ చేశారు. ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చాక ఇక్కడ 24 వార్డులలో ఈ మందును పంచారు. ఇప్పుడు దీనిని సిటీ అంతటా కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలకు పంచనున్నట్లు అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేశ్ కాకాణి చెప్పారు. హోమియో, ఆయుర్వేదిక్ మందులను ప్రొఫైలాక్టిక్ లేదా ఇమ్యూనిటీ బూస్టర్లుగా ఉపయోగించొచ్చని టాస్క్ ఫోర్స్ జూన్ 8న రాష్ట్ర సర్కారుకు రిపోర్ట్ ఇచ్చింది. మొదట 3 రోజులు మందును వాడాలని, కరోనా వ్యాప్తి కొనసాగిన ప్రాంతాల్లో నెల తర్వాత మరో డోస్ రిపీట్ చేయాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. దీంతో పాటు జ్వరానికి వాడే సంషామణి వాటి 500ఎంజీ (15 రోజులు), యాంటీ మలేరియా ట్యాబ్లెట్ ఆయుష్ 64 (15 రోజులు), శ్వాస సమస్యలకు వాడే అగస్త్య హరీతకీ మందులను (15 రోజులు) వాడొచ్చని రాష్ట్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో పేర్కొంది.