ఐక్యరాజ్యసమితి ఈ నెలలో విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం భారత్ 147 దేశాల జాబితాలో 116వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ర్యాంక్ 118తో పోలిస్తే కాస్త మెరుగైనప్పటికీ మన దేశ ప్రజలు ఆశించిన మేరకు సంతోషంగా లేరని నివేదిక వెల్లడిస్తోంది. ఐరాస తాజా హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం 10కి 4.4 హ్యాపీనెస్ స్కోరు పొందింది. ఈ గణాంకాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మనం ఇప్పటికే అనుభవిస్తున్న జీవిత విధానానికి ఇది కేవలం గణాంక ఆధారిత నిర్ధారణ మాత్రమే. సగటు భారతీయ పౌరుడు సంతోషంగా లేడనేది వాస్తవం. అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే... అపూర్వమైన స్థాయికి చేరుకుంటున్న ఆర్థికవ్యవస్థ ఉన్నప్పటికీ భారత్ ఎందుకు సంతోష సూచీలో పైకి ఎక్కడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనాలంటే ముందుగా మనల్ని మనమే తర్కించుకోవాలి. తగిన సమాధానాన్ని విశ్లేషించుకోవాలి.
సంతోషం గురించి ఆలోచించినప్పుడు మనలో చాలామంది దాన్ని అదృష్టం మీద ఆధారపడిన క్షణికమైన ఆనందంగా భావిస్తారు. జీతం పెరగడం, లాటరీ గెలవడం, శుభ శకునం వంటి వాటి వల్ల కలిగేదే ఆనందం అయితే ఈ దృక్పథం పరిమితమైనది. ఎందుకంటే ఇది సంతోషాన్ని అర్ధం చేసుకోవడంలో ఒక పెద్ద లోటును సృష్టిస్తుంది. అసలు సంతోషం మన నియంత్రణలో లేని విషయాల వల్ల మాత్రమే వస్తే.. ఇక మనం దాని గురించి చేసేందుకు ఏమీలేదు. కానీ సంతోషం అనే ఈ అభ్యాసాత్మక భావనను కొలవగల ప్రమాణాల ద్వారా పరిశీలించినప్పుడు, సమస్య మూలాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. యూఎన్ సస్టెయిన్‌బుల్ సొల్యూషన్స్నెట్వర్క్ (ఎస్డీఎస్ఎన్) సంతోషాన్ని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన ప్రమాణాల్లో ఒకటి వ్యక్తి సగటు ఆదాయం. ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం.. అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్ణయిస్తుంది. అతనికి ఎన్ని అవకాశాలు, వనరులు అందుబాటులో ఉంటాయో ఆ వ్యక్తి ఆదాయం నిర్ణయిస్తుంది.
కొందరి చేతుల్లోనే సంపద
మన ఆర్థికవ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. ఆ సంపదలో అధిక మొత్తం పెద్ద జనాభాలోని చిన్న వర్గం చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి. అందుకే మన భారత ఆర్థిక వ్యవస్థ కొత్త మైలురాళ్లు చేరుకుంటున్న వార్తలు వింటున్నప్పటికీ ఇంకా చాలామంది ప్రాథమిక సౌకర్యాలు కూడా పొందలేకపోతున్నారు. ‘ఎస్డీఎస్ఎన్’ ప్రకారం సంతోషాన్ని ప్రభావితం చేసే మరో ముఖ్యమైన అంశం సామాజిక మద్దతు. ఇది నిజానికి భారతదేశాన్ని బలంగా నిలుపుతోంది. వ్యక్తిగతకు ప్రాధాన్యమిచ్చే పాశ్చాత్య సమాజాలకంటే భిన్నంగా మన వైవిధ్యభరిత జనాభా, సమూహ కేంద్రిత సంప్రదాయాలు బలమైన సామాజిక మద్దతు వ్యవస్థలను అందిస్తాయి. ఇవి జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలకు సహాయపడతాయి. అయితే పట్టణీకరణ పెరుగుతున్నకొద్దీ ఈ బలమైన బంధాలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. మెరుగైన జీవనోపాధి కోసం ప్రజలు తమ సమూహ బంధాలను వదిలి ఒంటరితనంతో కూడిన జీవితం వైపు వెళ్తున్నారు. దీనికి తోడు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సరైన సదుపాయాల కొరత పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.
స్వేచ్ఛా జీవితం సంతోషానికి కీలకం
జీవన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా సంతోషానికి చాలా కీలకం. కానీ మన కఠినమైన వ్యవస్థలు, బలమైన సామాజిక నియమాలు, ఆర్థిక పరిమితులు చాలాసార్లు వ్యక్తులు తమ విలువలు, అవసరాలు, కోరికలకు అనుగుణంగా జీవించడాన్ని అడ్డుకుంటాయి. దాతృత్వం కూడా ఒక సంతోషకరమైన సమాజానికి ముఖ్యమైన భాగం. భారతదేశం దయ, దానం వంటి విలువలను గౌరవిస్తోంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే, కష్టాలు భారం వేసినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సమయం లేదా ఒక్కోసారి తగిన శక్తి లేకపోవడం కూడా సహజం. భారతీయులు సంతోషాన్ని కోరుకోవడం లేదని కాదు. అసలు విషయం ఏమిటంటే, మన సమాజం, వ్యవస్థలు నిజంగా సంతోషాన్ని అనుసరించే జీవనాన్ని మద్దతు ఇవ్వడానికి రూపొందించలేదు. ‘పాజిటివ్‌గా ఉండండి’ లేదా ‘మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి’ అని చెప్పడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు. ఆశావహ దృక్పథంతో వ్యవస్థాగత మార్పులు జరగకపోతే.. భారత్ సంతోష సూచీలో వచ్చే సంవత్సరం లేదా ఎప్పటికీ- పైకి ఎక్కడం కష్టమే.
- ఎస్. శ్రియ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
