- సంస్కరణలపై సస్పెన్స్.. సిలబస్ మార్పుపై విద్యాశాఖ సైలెన్స్
- 80:20 విధానం, కొత్త బుక్స్‌పై వీడని అనిశ్చితి
- సీఎం ఓకే చెప్పినా ముందుకు కదలని ఫైల్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. సిలబస్ తగ్గింపు, పరీక్షల విధానంలో మార్పులపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వడం లేదు. జూన్ ఫస్ట్ నుంచి ఏ సిలబస్ బోధించాలని లెక్చరర్లు తలలు పట్టుకున్నాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. మరో రెండు వారాల్లో కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నా.. విద్యాశాఖ మాత్రం మౌనం వీడడం లేదు. సిలబస్ తగ్గింపు, పరీక్షల విధానంలో మార్పులపై విద్యాశాఖ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. వచ్చే నెల జూన్ ఫస్ట్ నుంచి క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. అసలు ఏ సిలబస్ బోధించాలో తెలియక అటు లెక్చరర్లు, విద్యాసంస్థలు తలలు పట్టుకున్నాయి.
ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో క్లాసులు మొదలు కాగా.. పాత సిలబస్ పాఠాలే చెప్తుండటం గమనార్హం. ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 2012లో, ఆర్ట్స్ సబ్జెక్టులకు 2015లో సిలబస్ ను చివరిసారిగా సవరించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈ సిలబస్‌ను అమలు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది. దీనిలో భాగంగానే పరీక్షల్లోనూ 80:20 విధానాన్ని (80 మార్కులు థియరీ, 20 మార్కులు ఇంటర్నల్స్/ప్రాక్టికల్స్) ప్రతిపాదించింది.
ఈ కీలక ఫైలుకు ముఖ్యమంత్రి గతేడాది అక్టోబర్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సబ్జెక్ట్ కమిటీలు కూడా కసరత్తు పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చాయి. కానీ, అమలు దగ్గరకు వచ్చేసరికి కథ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త సిలబస్ ప్రకారం పుస్తకాలు ముద్రించాలని తెలుగు అకాడమీకి బాధ్యతలు అప్పగించినా.. విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి కొర్రీలు పెడుతున్నట్లు తెలిసింది.
ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ ఆమోదం ఉందా.. టెండర్ ప్రక్రియ ఎలా జరిగింది.. వంటి ప్రశ్నలతో ఫైళ్లను వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. అధికారులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా, తుది ఆమోదం మాత్రం లభించడం లేదు. దీంతో కొత్త పుస్తకాల ముద్రణపైన స్పష్టత కరువైంది.
ప్రైవేట్ కాలేజీల పాత సిలబస్ తోనే..
విద్యాశాఖ నుంచి స్పష్టత లేకపోవడంతో పలు కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటికే పాత సిలబస్‌తోనే తరగతులు ప్రారంభించేశాయి. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సిలబస్ అంటే.. ఇప్పటివరకు చదివిన చదువంతా వృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మార్కెట్లోకి కొత్త పుస్తకాలు రావాల్సి ఉన్నా.. ఇప్పటికీ విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో అది ఆమోదానికి నోచుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇప్పుడు వద్దంటే.. ఇప్పటికే తెలుగు అకాడమీ ప్రింట్ చేసిన పుస్తకాల పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. మరో 15 రోజుల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఓకే చెప్తే తప్పా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలకు వీటిని పంపించరు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే.. పుస్తకాల పంపిణీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
ఇంటర్నల్స్ ఉన్నట్టా లేనట్టా?
ఇంటర్ లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 80:20 విధానంపై క్లారిటీ కరువైంది. ప్రస్తుతం ఇంగ్లిష్ సబ్జెక్టులో మాత్రమే ఇంటర్నల్ మార్కుల విధానం అమల్లో ఉంది. ఇందులో 80 మార్కులకు థియరీ కాగా, 20 మార్కులు ఇంటర్నల్‌కు కేటాయించారు. ఇకపై అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే విధానం కొనసాగించాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీనికి అనుగుణంగానే సిలబస్ లో మార్పులు చేశారు. అయితే, సిలబస్ మార్పుపైనే క్లారిటీ లేకపోవడంతో.. ఈ కొత్త విధానంపైనా అయోమయం నెలకొన్నది.
సంస్కరణలపై సెక్రటరీ మోకాలడ్డు సరికాదు
ఇంటర్మీడియట్ లో సీఎం ఆమోదంతో జరుగుతున్న సంస్కరణపై విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా అడ్డుకోవడం సరికాదు. ఇప్పటికే తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రింట్ చేసింది. అవన్నీ కాలేజీలకు పంపించాల్సి ఉంది. ఆలస్యం చేస్తే పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరడం కష్టం. కొత్త సిలబస్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో వివిధ కారణాలతో ఆపడం సరికాదు. ఇప్పటికైనా వెంటనే నిర్ణయం తీసుకోవాలి. - మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్
