- మూడింటికి ప్రత్యేక కారిడార్
- మున్సిపాలిటీల్లో వచ్చే 25 ఏళ్ల అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి పనులు
- సింగరేణి మున్సిపాలిటీలన్నీ ఇకపై ఒకే యూనిట్
- ఏఐతో ట్రాఫిక్ కంట్రోల్.. మున్సిపాలిటీల్లో ఈవీలే తీసుకోవాలి
- నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్
- ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టును కలుపుతూ టూరిజం కారిడార్
- మొత్తం ఐదు కారిడార్లు డెవలప్ చేయాలి
- ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లలో పెరిగే జనాభా, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 'అర్బన్ సెంట్రిక్ డెవలప్‌మెంట్' ప్లానింగ్ ఉండాలని, అందుకు తగ్గట్టే అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌లపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్)లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని తెలిపారు. వరంగల్‌లో రాబోయే ఎయిర్ పోర్టును దృష్టిలో ఉంచుకొని కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ నీటి అవసరాలను ఇప్పుడే పరిగణనలోకి తీసుకోవాలని, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు డిఫెన్స్ ఆధ్వర్యంలో రాబోతోందని తెలిపారు.పెద్ద మున్సిపాలిటీల సమీపంలో రేడియల్ రోడ్లు వచ్చేలా డిజైన్ చేయాలన్నారు.
రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు ప్రత్యేకంగా 'టెంపుల్ కారిడార్'ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అలాగే ఉత్తర తెలంగాణలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టును అనుసంధానిస్తూ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా 'టూరిజం కారిడార్'ను త్వరితగతిన నిర్మించాలని ఆదేశించారు.
రాబోయే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపూర్ జోగులాంబ ఆలయ ప్రాంతాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని సూచించారు. వీటితో పాటు రవాణా, వాణిజ్యపరంగా కీలకమైన మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల మార్గాన్ని ఒక కారిడార్‌గా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలను కలుపుతూ మరో కారిడార్‌ను యుద్ధ ప్రాతిపదికన డిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ కారిడార్ల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీల్లో ఈవీలే వాడాలి..
మున్సిపాలిటీల్లో ఖర్చు తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలను ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునేవి కూడా ఈవీలే ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పట్టణ ప్రణాళికలో విధిగా ఉండాలని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడటంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని, పట్టణాల్లో రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్లు, స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వాడాలన్నారు. ఎస్టీపీల డిజైన్ పక్కాగా ఉండాలని, సీవరేజ్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే భవన నిర్మాణాలకు వాడేలా నిబంధన తేవాలని స్పష్టం చేశారు.
సింగరేణి పరిధిలో కొత్త విధానం
సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలి టీలను ఒకే యూనిట్‌గా పరిగణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులను ఇతర ప్రాంతాలకు కాకుండా స్థానికంగానే ఖర్చు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీ శ్యాంసుందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
