అయ్యో.. అరబ్.. చేయని తప్పుకు శిక్ష..! కన్నెత్తి చూడని టూరిస్టులు.. వెలవెలబోతున్న పర్యాటక ప్రదేశాలు

అయ్యో.. అరబ్.. చేయని తప్పుకు శిక్ష..! కన్నెత్తి చూడని టూరిస్టులు.. వెలవెలబోతున్న పర్యాటక ప్రదేశాలు

యుద్ధం జరుగుతున్నది ఇరాన్‌‌ –ఇజ్రాయెల్‌‌, అమెరికా మధ్య. కానీ.. దాని ఎఫెక్ట్‌‌ వాటిని ఆనుకుని ఉన్న అన్ని దేశాలపైనా పడుతోంది. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ గల్ఫ్‎లోని చాలా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్​మెంట్లు తగ్గిపోతున్నాయి. ఎప్పుడూ ప్రపంచవాప్త పర్యాటకులతో కిటకిటలాడే గల్ఫ్​ వైపు టూరిస్ట్‌‌లు కన్నెత్తి కూడా చూడడం లేదు. ‘సేఫ్ హెవెన్’గా పేరున్న పశ్చిమాసియా దేశాలు ఇప్పుడు రిస్క్‌‌ స్పాట్లుగా మారాయి. 

అమెరికా–ఇజ్రాయెల్ కూటమి ఫిబ్రవరి 28న ఇరాన్‌‌పై దాడులు ప్రారంభించింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడులు చేసింది. యుద్ధం ఈ మూడు దేశాలను దాటి యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, కువైట్‌‌ లాంటి చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలకు వ్యాపించింది. గడిచిన నెల రోజుల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దాదాపు మూసుకుపోవడం, మిస్సైల్, డ్రోన్ దాడులు, విమానాలు రద్దు కావడం, షిప్పింగ్స్‌‌ ఆగిపోవడం.. ఇలా ఎన్నో పరిణామాలు జరిగాయి. 

అవన్నీ ఇరాన్‌, ఇజ్రాయెల్‌‌తోపాటు దాదాపు అన్ని పశ్చిమాసియా దేశాల మీద ప్రభావం చూపించాయి. వాటి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కదిలించాయి. గల్ఫ్ కో–ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు(పశ్చిమాసియాలో ప్రాముఖ్యం ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌‌, కువైట్‌‌.. లాంటివి) భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. నాలుగు వారాల్లోనే గల్ఫ్​ దేశాలకు ఉన్న ‘సేఫ్ హెవెన్’ ఇమేజ్ దెబ్బతిన్నది. టూరిజం, పెట్టుబడులు, ఆర్థిక వృద్ధి.. ఒక్కొక్కటిగా అన్నీ తగ్గిపోతున్నాయి. 

ఆర్థిక రంగంపై ప్రభావం

యుద్ధానికి ముందు జీసీసీ దేశాల ఎకానమీ బూమ్‌‌లో ఉంది. 2025లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్ 9.52 కోట్లు, ఖతార్ హమద్ ఎయిర్‌‌పోర్ట్ 5.43 కోట్ల మంది ప్రయాణికులతో ఎంతో రద్దీగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు రాకపోకలు దాదాపుగా ఆగిపోయాయి. హార్మూజ్ మూసుకుపోవడం, ఆయిల్ ధరలు పెరగడం, ప్రొడక్షన్ తగ్గడం వల్ల వాటి జీడీపీ వృద్ధి 1.8 పాయింట్ల వరకు తగ్గుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంతరాయాలు మాత్రమే కాదు.. ఏవియేషన్, ఫుడ్ ఇంపోర్ట్స్ కూడా తగ్గాయి. 

పెట్టుబడులు తగ్గుతున్నాయి

యుద్ధానికి ముందు 2024–25లో జీసీసీ దేశాల్లో ఎఫ్​డీఐ(విదేశీ పెట్టుబుడులు)ల వాటా 38శాతం ఉంది. యూఏఈ, సౌదీ అరేబియాలు టెక్, టూరిజం, రియల్ ఎస్టేట్‌‌లో భారీ ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆకర్షించాయి. సౌదీ అరేబియా “విజన్ 2030” ప్లాన్​లో కూడా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. అమెరికా కంపెనీలైతే 2020–-25 మధ్య జీసీసీలో దాదాపు 70 బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. 

కానీ.. యుద్ధం మొదలైనప్పటినుంచి ఇన్వెస్టర్లు ‘వెయిట్ అండ్ వాచ్’ మోడ్‌లో ఉన్నారు. అంటే కొత్త ఇన్వెస్ట్‌‌మెంట్లకు దూరంగా ఉంటున్నారు. కొందరేమో ఇన్వెస్ట్‌‌మెంట్లను వెనక్కి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు యూఏఈలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లు 37 శాతం తగ్గాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లు కుప్పకూలాయి. 

ఆల్టర్నేట్‌‌ ఏంటి..? 

యుద్ధం వల్ల క్యాపిటల్ ఫ్లోలు ‘స్టేబుల్ కారిడార్స్’ వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని స్టేబుల్ పాలసీలు, యంగ్ లేబర్ వల్ల మాన్యుఫాక్చరింగ్, టెక్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. వియత్నాంతోపాటు సౌత్ ఈస్ట్ ఏషియా కూడా ఎఫ్‌‌డీఐలను ఆకర్షిస్తున్నాయి. 

600 మిలియన్ డాలర్లు లాస్‌‌ 

యుద్ధం నేపథ్యంలో.. ప్రయాణికుల్లో భయం పెరగడం వల్ల పశ్చిమాసియా దేశాల పర్యాటక రంగం నష్టాలను ఎదుర్కొంటోంది. దీని ప్రభావం విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, హోటళ్లు, టూర్ ఆపరేటర్లు.. ఇలా అన్నింటిపైనా పడుతోంది. ఆ దేశాలకు టూర్లకు వెళ్లాలి అనుకునేవాళ్లంతా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. వరల్డ్ ట్రావెల్ అండ్‌‌ టూరిజం కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) అంచనా ప్రకారం.. ఈ సీజన్‌‌లో ఆ దేశాలకు వెళ్లే ఇంటర్నేషనల్ ట్రావెలర్లు రోజుకు దాదాపు 600 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తుంటారు. అదంతా పశ్చిమాసియాకు ఆదాయమే. కానీ.. ఇప్పుడు దాన్ని కోల్పోవాల్సి వస్తోంది. 

అంతెందుకు జీసీసీ దేశాల జీడీపీలో 12 శాతం టూరిజం వల్లే సమకూరేది. 2025లో కేవలం ఒక్క దుబాయ్‌‌కే సుమారు 1.9  కోట్ల మంది విజిటర్లు వెళ్లారు. డబ్ల్యూటీటీసీ ప్రకారం.. యుద్ధం ముగిసినా 2026లో పశ్చిమాసియాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 11నుంచి 27 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. జీసీసీ దేశాలన్నీ ఒకే సమయంలో తమ గగనతలాన్ని మూసివేశాయి. సాధారణంగా ఈ దేశాల్లో రంజాన్ నెలలోనే టూరిజం పెరుగుతుంది. కానీ.. ఆ టైంలో మూసివేతల వల్ల పర్యాటక రంగానికి సుమారు 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా.

కనెక్టింగ్ కారిడార్

పశ్చిమాసియా కేవలం ఒక టూరిజం డెస్టినేషన్ మాత్రమే కాదు.. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కనెక్టింగ్ కారిడార్‌‌‌‌గా కూడా పని చేస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మంది (ఆసియా, యూరప్, ఆఫ్రికా) తమ దేశాలకు గల్ఫ్ దేశాల నుంచి సుమారు 4 గంటల ఫ్లైట్ జర్నీ చేసి చేరుకోవచ్చు. మూడింట ఒక వంతు మంది 8 గంటల్లో చేరుకోవచ్చు. 

అందుకే చాలా దేశాలకు ఇక్కడినుంచి కనెక్టింగ్‌‌ ఫ్లయిట్స్ నడుపుతుంటారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేవాళ్లలో దాదాపు 14 శాతం మంది ఈ దేశాల్లోనే ఫ్లయిట్​ మారుతారు. దోహా ఎయిర్‌‌పోర్ట్ నుంచి 170కి పైగా దేశాలకు విమానాలు నడుస్తుంటాయి. దీని ద్వారా ప్రయాణికులకు ట్రావెలింగ్‌‌ ఖర్చు తగ్గుతుంది. పశ్చిమాసియా దేశాలకు లాభం వస్తోంది. కానీ.. ఇప్పుడు ఆ దేశాల్లో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లు మూసేయడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

దుబాయ్‌‌ పరిస్థితి ఏంటి..? 

గల్ఫ్​లో చాలా ప్రాముఖ్యం ఉన్న సిటీ దుబాయ్‌‌.. అందుకే అక్కడ ఇన్వెస్ట్‌‌ చేసేందుకు విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ.. యుద్ధం వల్ల చాలావరకు ఇన్వెస్ట్‌‌మెంట్లు తగ్గిపోయాయి. దుబాయ్‌‌పై జరిగిన దాడుల వల్ల ఇన్వెస్టర్స్‌‌ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నది. ప్రాపర్టీ ఇన్వెస్ట్‌‌మెంట్స్ 2025తో పోలిస్తే మార్చి నెల మొదటి 12 రోజుల్లో 37- 49 శాతం తగ్గాయి. ధరలు 10-20 శాతం పడిపోయాయి. 

మిగతా రంగాల్లో కూడా ఇన్వెస్ట్‌‌మెంట్లు బాగా తగ్గాయి. అయితే.. ఆ పెబ్టుబడులన్నీ ఎక్కువగా సింగపూర్, హాంకాంగ్‌‌కి మళ్లాయి. ఇండియన్ ఎంట్రప్రెన్యూర్స్ ఎక్కువగా సింగపూర్‌‌‌‌ని ఎంచుకుంటున్నారు. కొంతమంది ఎన్‌‌ఆర్‌‌‌‌ఐలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే.. ఇదంతా స్వల్పకాలిక ప్రభావం మాత్రమే అని దుబాయ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ట్యాక్స్ ఫ్రీ పాలసీలు బలంగా ఉండడం వల్ల మళ్లీ రికవర్ అయ్యే చాన్స్ ఉందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు.