పెట్రోల్ డీజిల్ పెంపుతో కంపెనీల నష్టాలు రూ.5వేల కోట్లు తగ్గుతాయ్.. మరి ఇంకెంత పెంచాల్సి ఉందంటే?

పెట్రోల్ డీజిల్ పెంపుతో కంపెనీల నష్టాలు రూ.5వేల కోట్లు తగ్గుతాయ్.. మరి ఇంకెంత పెంచాల్సి ఉందంటే?

దేశంలోని ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్ డీజిల్ పై రేటును జస్ట్ రూ.3 పెంచటంతోనే జనంలో ఆందోళన స్టార్ట్ అయ్యింది. ఇది ట్రైలర్ మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ.. మోడీ సర్కార్ ఒక్కసారిగా రేట్లు పెంచితే వ్యతిరేకత వస్తుందని విడతల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచే ప్లాన్‍లో ఉందని తెలుస్తోంది. అయితే యుద్ధం ముందు ఉన్న క్రూడ్ ఆయిల్ రేట్ల స్థాయికి కంపెనీలు తమ అమ్మకాలకు చేరుకోవాలంటే రేట్లను ఇంకెంత పెంచాల్సి ఉంటుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశంలోని కంపెనీల నష్టాలను పూడ్చడానికి ప్రస్తుతం పెంచిన రూ.3 లీటరుకు ఏమాత్రం సరిపోదని నిపుణులు చెబుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత ఏడాది లాభాల స్థాయికి చేరుకోవాలంటే.. ఈ 3 రూపాయల పెంపు కాకుండా ధరలను మరో 16 శాతం మేర పెంచాల్సి ఉంటుందని తేలింది. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఈ మొదటి పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67 కు చేరుకుంది.

గత ఏడాది జూలైలో ఇండియన్ క్రూడ్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు 70.95 డాలర్లుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ధర ఏకంగా 61 శాతం పెరిగి 113.99 డాలర్లకు చేరుకుంది. దీనికి తోడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 87.51 నుంచి 94.84 కు పడిపోయింది. ఈ రెండు ప్రభావాల వల్ల రూపాయి పరంగా ముడి చమురు దిగుమతి ఖర్చు ఏకంగా 74 శాతం పెరిగిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎలాంటి కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాలను వసూలు చేయడం లేదు. అయినప్పటికీ ముడి చమురు ధరల భారాన్ని ఆయిల్ సంస్థలే భరిస్తుండటంతో వాటి నష్టాలు కొండలా పేరుకుపోతున్నాయి.

►ALSO READ | క్రోమా ఆపిల్ సేల్ ధమాకా: రూ.45వేలకే ఐఫోన్ 17.. ఆఫర్ దక్కించుకునేందుకు ఒక్క రోజే ఛాన్స్

ప్రస్తుతం పెట్రోల్‌పై లీటరుకు రూ.12.72, డీజిల్‌పై రూ.19.82 మేర నష్టంతో ఆయిల్ కంపెనీలు అమ్ముకుంటున్నట్లు అంచనా. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 125 డాలర్లకు చేరితే.. ఈ నష్టాలు పెట్రోల్‌పై రూ.21.48 కి, డీజిల్‌పై రూ.28.58 కి పెరుగుతాయి. ప్రస్తుతం నెలకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆయిల్ సంస్థలకు సుమారు రూ.55వేల 416 కోట్ల నష్టం వస్తోంది. మే 15న లీటరుకు 3 రూపాయల పెంపు వల్ల ఈ నెలవారీ నష్టాలు రూ.50వేల 450 కోట్లకు తగ్గుతాయి. అంటే కంపెనీలకు ప్రస్తుతం రేటు పెంపుతో నెలకు దాదాపు రూ.5వేల కోట్ల మేర నష్టం తగ్గి ఉపశమనం లభిస్తుంది. 

అయితే దేశంలో ఇంధన ధరల పెరుగుదల ప్రభావం అప్పుడే ద్రవ్యోల్బణంపై పడటం స్టార్ట్ అయ్యింది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ధరలు 67 శాతం పెరగడంతో ఏప్రిల్ నెలలో హోల్సేల్ ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్ట స్థాయి 8.3 శాతానికి చేరుకుంది. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సామాన్యుడిపై మరింతగా ధరల భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు పెరిగే రేట్లను తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.