సమ్మక్క సారక్క వర్శిటీ తవ్వకాల్లో.. పురాతన ఆలయ శిలలు, నాగుపాములు ప్రత్యక్షం

సమ్మక్క సారక్క వర్శిటీ తవ్వకాల్లో..  పురాతన ఆలయ శిలలు, నాగుపాములు ప్రత్యక్షం

ములుగు జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  సమ్మక్క-సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనుల్లో  భాగంగా జెసిబితో తవ్వుతుండగా  పురాతన ఆలయ శిలలు,నాగు పాములు ప్రత్యక్షమయ్యాయి. 


తవ్వకాల్లో భాగంగా పురాతన రాళ్లను జెసిబి కదిలించగానే...  ఊహించని విధంగా మూడు నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా బుసలు కొడుతూ పాములు బయటకు రావడంతో, భయంతో వణికిపోయిన జెసిబి డ్రైవర్ వాహనాన్ని అక్కడే నిలిపివేసి పరుగులు తీశాడు.

 ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... పాములు కనిపించిన వెంటనే జెసిబి యంత్రం కూడా మొరాయించి ఆగిపోయింది.వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బయటపడిన శిలల ఆకృతిని బట్టి ఇక్కడ కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయం ఉండి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతం నిర్మాణ పనులను నిలిపివేశారు.పురాతన సంపదతో పాటు నాగుపాములు బయటపడటం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.