నల్గొండలో ఎన్హెచ్ 565 పనులకు రూ.14.45 కోట్లు

నల్గొండలో ఎన్హెచ్ 565 పనులకు రూ.14.45 కోట్లు

నల్గొండ, వెలుగు:  నకిరేకల్–నాగార్జునసాగర్ నేషనల్​ హైవే 565లో భాగంగా నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్ బైపాస్ రోడ్డు నుంచి డీఈఓ ఆఫీస్ వరకు రహదారి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.14.45 కోట్లు మంజూరు చేసింది. గతంలో రోడ్డు విస్తరణ కారణంగా ఇండ్లు, షాపులు కోల్పోతామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం, కోర్టుకు వెళ్లడంతో ఈ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, హైవేను బైపాస్ మీదుగా మళ్లించడంతో పాటు నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రులను కలిసి కృషి చేశారు. దీనికి స్పందించిన కేంద్రం 2025–26 వార్షిక ప్రణాళిక కింద ఎటువంటి మార్పులు లేకుండా పూర్తిస్థాయిలో పరిపాలనా, సాంకేతిక ఆమోదాలు తెలిపింది. బ్లాక్ టాపింగ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. నిధుల మంజూరు పట్ల నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.