ఆపరేషన్ నార్కోస్ సక్సెస్.. రూ.30 లక్షల గంజాయి పట్టివేత

ఆపరేషన్ నార్కోస్ సక్సెస్.. రూ.30 లక్షల గంజాయి పట్టివేత

పద్మారావునగర్, వెలుగు: రైళ్ల ద్వారా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ విభాగం మరోసారి ఉక్కుపాదం మోపింది. “ఆపరేషన్ నార్కోస్”లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో రూ. 30 లక్షల విలువైన 60.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మార్చి 27న సికింద్రాబాద్​–బేగంపేట మధ్య నడుస్తున్న కోణార్క్ ఎక్స్​ప్రెస్​లో పోలీసులు డికాయ్ తనిఖీలు నిర్వహించారు. జనరల్ కోచ్​లో యజమాని లేని 7 సంచులను గుర్తించారు.

 ప్రయాణికులను ప్రశ్నించినా ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని పరిశీలించగా 31 ప్యాకెట్ల గంజాయి బయటపడింది. స్వాధీనం చేసిన గంజాయిని హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించి, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్​లో ఎన్‌‌‌‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

2025లో 99 కేసుల్లో రూ. 6.73 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 119 మందిని అరెస్ట్ చేయగా, 2026లో ఇప్పటివరకు 14 కేసుల్లో రూ. 1.15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుని 20 మందిని అదుపులోకి తీసుకున్నామని  డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అలకుంట నవీన్ కుమార్ తెలిపారు. రైళ్లలో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే 139 హెల్ప్‌‌‌‌లైన్‌‌‌‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.