న్యూఢిల్లీ, వెలుగు: కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల అఖిల భారత వేదిక పిలుపునిచ్చింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే మత రాజకీయాలు పెరిగిపోయి, ప్రజల సంక్షేమ పథకాలు కుంటుపడతాయని హెచ్చరించింది.
ఈ మేరకు శనివారం వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల నేతలు బి.వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ), గుల్జార్ సింగ్ గారియా (బీఐఎంయూ), ధీరేంద్ర ఝా (ఏఐఏఆర్ఎల్ఏ), ఆశిశ్ గంగూలీ (ఏఐఎస్కేఎస్), దేవేంద్ర (ఐఏకేఎస్ యూ) ఓ ప్రకటన రిలీజ్ చేశారు. “దేశవ్యాప్తంగా బీజేపీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు ప్రజల జీవన పరిస్థితులను మరింత దుర్భరంగా మారుస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం కార్మిక కోడ్‌లను తీసుకువచ్చింది. దాని స్థానంలో తెచ్చిన కొత్త చట్టాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయి.
గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసింది. గతంలో వెనక్కి తీసుకున్న వ్యవసాయ చట్టాల స్థానంలో ఇప్పుడు సీడ్స్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు 2025 వంటివి ప్రవేశపెట్టి రైతులపై అదనపు భారాలు మోపుతున్నారు. కార్పొరేట్ ఆధిపత్యం, ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీని ఓడించడం అత్యవసరం. కేరళలో మెరుగైన మానవ అభివృద్ధి సూచికలను సాధించిన ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి. వామపక్ష ప్రత్యామ్నాయమే దేశానికి రక్షణ"అని స్పష్టం చేశారు.
