నిజాయతీగా పనిచేస్తున్న ఆఫీసర్లకు పౌరసన్మానం : కోదండరామారావు

నిజాయతీగా పనిచేస్తున్న ఆఫీసర్లకు పౌరసన్మానం : కోదండరామారావు

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వం అవినీతిపరులను ప్రోత్సహిస్తూ నిజాయతీగా పనిచేసే అధికారులను నిర్లక్ష్యం చేస్తోందని లోక్ సత్తా సంస్థ రాష్ట్ర సలహాదారు ప్రొఫెసర్​ కోదండరామారావు, జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ  వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ అన్నారు. లంచం తీసుకోబోమంటూ ఆఫీసులో బోర్డులు ఏర్పాటు చేసిన టీఎస్ఎన్​పీడీసీఎల్​ హనుమకొండ అసిస్టెంట్​ డివిజనల్​ ఇంజినీర్​పోడేటి అశోక్, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రెవెన్యూ ఇన్​స్పెక్టర్​  సీహెచ్. నర్సయ్యను అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జ్వాల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. 

ముందుగా హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్​ విగ్రహం వరకు డప్పు చప్పుళ్లతో వారిని గుర్రాలపై ఊరేగించారు. సన్మానం పొందిన ఉద్యోగులు అశోక్, నర్సయ్య మాట్లాడుతూ.. తప్పు చేసిన ఉద్యోగులు భయపడాల్సింది పోయి, నిజాయతీగా ఉన్న ఆఫీసర్లు భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. నిజాయతీగా సేవలందిస్తున్న  అధికారులకు ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా పోయిందని, తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులు కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.  కానీ తాము చేస్తున్న సేవలకు సమాజంలో మాత్రం ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని, మున్ముందు మరింత మెరుగ్గా సేవలందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అన్వేష్​, రవీందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.