హాస్పిటల్ ఫార్మసీలు తెరిచే ఉంటయ్..అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 కు కాల్ చేయవచ్చు: డీసీఏ

హాస్పిటల్ ఫార్మసీలు తెరిచే ఉంటయ్..అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ 1800 599 6969 కు కాల్ చేయవచ్చు: డీసీఏ

హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) బుధవారం మెడికల్ షాపుల దేశవ్యాప్త బంద్‌‌‌‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో... రాష్ట్రంలోని హాస్పిటల్ ఎటాచ్డ్ ఫార్మసీలతో పాటు అపోలో, మెడ్ ప్లస్ వంటి కార్పొరేట్ ఫార్మసీలు కూడా తెరిచే ఉంటాయని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) స్పష్టం చేసింది. బంద్ సమయంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు డీసీఏ డైరెక్టర్ జనరల్, ఏఐఓసీడీ తెలంగాణ చాప్టర్‌‌‌‌ తో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా అన్ని హాస్పిటల్ అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులు యథాతథంగా పనిచేస్తాయని, ప్రజలకు నిరంతరాయంగా మందులు సరఫరా చేస్తాయని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఏ మందు కావాలన్నా జిల్లా స్థాయి ఏఐఓసీడీ ప్రతినిధులు స్థానిక డ్రగ్ ఇన్‌‌‌‌ స్పెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ మందులు అందేలా చూస్తారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మందుల సరఫరాను పర్యవేక్షించేందుకు డీసీఏ తన క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసింది.

ఎక్కడైనా మందుల కొరత ఏర్పడినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించాలని ఫీల్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఏదైనా అత్యవసర మందులు దొరకని పక్షంలో వెంటనే స్థానిక డ్రగ్ ఇన్‌‌‌‌ స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌ ను సంప్రదించాలని సూచించింది. సమాచారం, సహాయం కోసం డీసీఏ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800- 599 -6969 ను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల ఫోన్ నంబర్లు, కార్యాలయ చిరునామాల కోసం డీసీఏ అధికారిక వెబ్‌‌‌‌ సైట్ https://dca.telangana.gov.in/ లోని ‘Key Contacts’ విభాగాన్ని చూడాలని సూచించింది.