సార్..​ ఆకలైతాంది

సార్..​ ఆకలైతాంది
  • హాస్టళ్లలో సాయంత్రం 7 గంటలకే డిన్నర్ 
  • తరువాత 2 గంటల పాటు స్టడీ అవర్స్​
  • రాత్రిపూట స్నాక్స్​ అయినా ఇవ్వాలని వినతులు
  • ఆకలితో చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నామని ఆవేదన
  • డిన్నర్​ టైమ్​ 8.30 గంటలకు పెంచాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని రెసిడెన్షియల్​ స్కూళ్లలో సాయంత్రం 7 గంటలకే డిన్నర్​ ముగుస్తుండడంతో... రాత్రి తొమ్మిదింటికి పిల్లలకు మళ్లీ ఆకలి అవుతున్నది. డిన్నర్​ తరువాత రెండు గంటలు స్టడీ అవర్స్​ ఉండడం, ఆకలి అవుతుండడంతో స్టడీస్  మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.  హాస్టల్స్ లో స్టడీ అవర్స్  తర్వాత​9 గంటలకు పిల్లలను పడుకోబెడుతున్నారు.

 డిన్నర్ కు, పడుకోవడానికి మధ్య మూడు గంటల గ్యాప్​ ఉంటుండటంతో... రాత్రి తొమ్మిది, పది గంటలకు ఆకలి వేస్తున్నదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చాలా మంది చిన్నపిల్లలు ఖాళీ కడుపుతో పడుకుంటుండగా, మరికొందరు టీచర్లను అడిగి  సాయంత్రం కిచెన్ లో మిగిలిపోయిన అన్నం  తింటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్టడీ అవర్స్  తరువాత డిన్నర్  పెట్టాలని లేదా పడుకునే ముందు పాలు లేదా అరటిపండ్లు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

 ఇంకొందరు సాయంత్రం స్నాక్స్​, డిన్నర్ ను దాచుకొని తింటున్నామని చెబుతున్నారు.  గతంతో గురుకులాల్లో 7.30కు స్టడీ అవర్స్  ముగిసేది.​ పిల్లలు 9 గంటలోపు డిన్నర్​  పూర్తి చేసి నిద్ర పోయేవారు. గత జులై నుంచి రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో కామన్​ టైం టేబుల్​ తీసుకొస్తూ ప్రభుత్వం జీవో  నంబర్ 16 జారీ చేసింది. అప్పటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొటున్నామని పిల్లలు చెబుతున్నారు. 

జులై నుంచి మారిన టైం టేబుల్

రాష్ట్రంలోని 1023 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్​ రెసిడెన్షియల్  స్కూళ్లలో మొత్తం 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది జులై 2న రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో కామన్  టైం​ టేబుట్​ అమలు చేస్తూ జీఓ నంబర్ 16 తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉదయం 8 గంటలకే పిల్లలకు స్కూల్​ ప్రారంభం అవుతుంది. గతంలో ఈ సమయం ఉదయం 9 గంటలకు ఉండేది. గంట సమయం ముందుకు జరపడంతో  ఉదయం పూట హడావుడిగా స్కూల్​ కు రెడీ అవుతున్నామని పిల్లలు వాపోతున్నారు. 

ఉదయం నుంచి 7.45 గంటల లోపు  బ్రేక్​ఫాస్ట్, 5, 6, 7 తరగతుల పిల్లలకు మధ్యాహ్నం 12.45 గంటలకు, 8 ఆపై తరగతుల పిల్లలకు 1.25 గంటలకు లంచ్, సాయంత్రం 4.30 గంటలకు స్నాక్స్, 6 గంటలకు డిన్నర్​ పెడుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు ఈవెనింగ్​ స్నాక్స్​లో పెట్టే... పల్లీచిక్కి, అరటిపండు, సేమియా, రవ్వకేసరి, బిస్కెట్లు, మిల్లెట్​ కుకీస్, ఉడికించిన పెసర్లను దాచుకొని రాత్రిపూట 
తింటున్నారు. 

ఈవెనింగ్​ స్నాక్స్​దాచుకొని తింటున్నా

రోజూ సాయంత్రం 6.30 గంటలకు డిన్నర్​ చేస్తున్న. రెండు గంటల స్టడీ అవర్స్ తరువాత మళ్లీ ఆకలేస్తుంది. స్టార్టింగ్​ లో ఖాళీ కడుపుతో పడుకునేదానిని. ఈ మధ్యే ఈవెనింగ్​ 4.30 గంటలకు ఇచ్చే స్నాక్స్  దాచుకొని పడుకునే ముందు తింటున్నా. నేనే కాదు.. మా హాస్టల్ లో చాలా  మంది ఇలాగే చేస్తున్నరు. రాత్రి 9 తరువాత స్నాక్స్, మిల్క్​ లాంటివి ఇస్తే బాగుంటుంది.  

హైదరాబాద్​లోని ఓ రెసిడెన్షియల్​ స్కూల్​ విద్యార్థి

పిల్లలు ఇబ్బంది పడుతున్నారు

చాలా మంది పిల్లలు రాత్రిళ్లు ఆకలి అంటున్నారు. కొంతమంది టీచర్లకు చెప్పి కిచెన్​ లో మిగిలిపోయిన అన్నం తింటున్నారు. అన్నం మిగలకుంటే అలాగే పడుకుంటున్నారు. స్టడీ అవర్స్​ తరువాత పిల్లలకు తినడానికి ఏదైనా ఇస్తే బాగుంటుంది. టైం టేబుల్ మార్చాలని లేదా పాలు, అరటిపండ్లు ఇవ్వాలని పిల్లలు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

  - ప్రిన్సిపాల్, హైదరాబాద్​లోని ఓ రెసిడెన్షియల్​ స్కూల్