- తెలంగాణతో టీడీపీ ప్రభుత్వం
- లాలూచీ పడిందన్న వైసీపీ ఎమ్మెల్సీలు
- చంద్రబాబుతో మాట్లాడి ప్రాజెక్టు
- ఆపించానని రేవంత్ అంటున్నారని వ్యాఖ్య
- జగన్‌తో మాట్లాడి కేసీఆర్ ఆపించారని హరీశ్ చెప్పారన్న మంత్రి నిమ్మల
- పోలవరం– నల్లమలసాగర్‌కు తెలంగాణ అడ్డుపడొద్దన్న చంద్రబాబు
హైదరాబాద్, వెలుగు: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్.. మీ వల్లే ఆగిదంటే.. మీ వల్లే ఆగిందంటూ పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. రాయలసీమ ప్రాజెక్టు పనులపై మంత్రి సమాధానమివ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, ఇషాక్ బాషా, రామసుబ్బారెడ్డి ఏపీ శాసనమండలిలో పట్టుబట్టారు. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ప్రాజెక్టును ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, కానీ, టీడీపీ వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో టీడీపీ ప్రభుత్వం లాలూచీ పడడంతోనే రాయలసీమ పనులు ఆగిపోయాయని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వంతో టీడీపీ ప్రభుత్వం లాలూచీ పడడంతోనే రాయలసీమ పనులు ఆగిపోయాయని విమర్శించారు. దానికి ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమకు అసలైన ద్రోహి జగనేనని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ఆగిపోయిందని ఆరోపించారు. ఆ తర్వాత అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఏపీ ఇరిగేషన్‌పై వివరణ ఇచ్చారు.
జగన్ ఉన్నప్పుడే ఎన్జీటీ స్టే ఇచ్చింది
జగన్సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు మండలిలో స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఐదేండ్ల పాటు జగన్ ఆ ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. మంత్రి సమాధానంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై కనీసం స్పందించలేదని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించానని రేవంత్ చెప్పుకుంటున్నారన్నారు. దీంతో బొత్స సత్యనారాయణ, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. 2020లో ఎన్జీటీకి వెళ్లి రాయలసీమ ఎత్తిపోతలను ఆపామంటూ గతంలోనే హరీశ్ రావు చెప్పారని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. అప్పటి సీఎం జగన్‌తో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడంతోనే ప్రాజెక్టు ఆగిందని హరీశ్ రావు చెప్పారన్నారు. దీనిపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేయగా.. మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదేనన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. దీంతో సభను చైర్మన్ వాయిదా వేశారు.
పోలవరం–నల్లమలసాగర్‌ను ఆపొద్దు: చంద్రబాబు
పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌తో ఎవరికీ నష్టం జరగదని, ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు చెప్పాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. గోదావరి నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను మాత్రమే తరలించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుతో రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకువస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీళ్లిచ్చి తెలుగుతల్లికి జలహారతి ఇవ్వడమే తన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని వెల్లడించారు. ఏటా గోదావరి నది నుంచి సగటున 3 వేల టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయన్నారు. గంగా–కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. ఏపీలో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో నిర్మించినవేనని స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని, ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని.. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందని పేర్కొన్నారు. వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం, ప్రకాశం జిల్లా సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం తేల్చి చెప్పారు. 30 ఏళ్లకు ముందు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని.. ఇప్పుడు ఈ ఏడాది జులైలోనే మొదటి దశ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ.2,500 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉందని .. బుధవారమే రూ.456 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశామని వివరించారు. వెలిగొండకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం గత పాలకులు చేశారని ఆయన విమర్శించారు.
