కిచెన్ తెలంగాణ : వానా కాలం ఇమ్యూనిటీ చాలా అవసరం.. వేడివేడిగా ఈ సూప్స్ తాగండి చాలు..!

కిచెన్ తెలంగాణ : వానా కాలం ఇమ్యూనిటీ చాలా అవసరం.. వేడివేడిగా ఈ సూప్స్ తాగండి చాలు..!

‘‘హాచ్.. వానలో తడిశా వేడి వేడిగా ఏదైనా ఉంటే ఇవ్వు..’’, ‘‘ఈ చిత్తడికి పొడి పొడిగా తినాలంటే గొంతు దిగట్లేదు..’’ ‘‘నోట్లో పెట్టుకుంటే గొంతులోకి జారిపోయేలా ఏదైనా ఘాటుగా ఉంటే.. ఆహా! ఈ వానాకాలం ఎంత హాయిగా గడిచిపోతుందో’’.. ఇవి మాన్​సూన్​లో వినిపించే కామన్ డైలాగ్స్. అంతేనా.. వానలో కొంచెం తడిసినా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు వెల్కమ్​ చెప్పినట్లే. సో.. ఇలాంటప్పుడే ఇమ్యూనిటీ పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ వాతావరణానికి సూపే బంగారం. మరింకేం.. వేడి వేడిగా, వెరైటీగా ఈ సూప్​లు చేసుకుని తాగేయండి. 

నిమ్మ ,కొత్తిమీరతో

కావాల్సినవి:

కొత్తిమీర : ఒక కట్టఅల్లం తరుగు, నూనె, 
పచ్చిమిర్చి పేస్ట్  :  ఒక్కో టేబుల్ స్పూన్
వెల్లుల్లి తరుగు :  రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి :  మూడు
ఉల్లిగడ్డ తరుగు : పావు కప్పు
వేడి నీళ్లు  : ఒకటిన్నర లీటర్ ,మొక్క జొన్న గింజలు, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, 
బీన్స్ తరుగు : ఒక్కోటి అర కప్పు
సోయాసాస్, చక్కెర :  ఒక్కో టీ స్పూన్
ఉప్పు, మిరియాల పొడి : సరిపడా
నిమ్మరసం, కార్న్​ ఫ్లోర్  : మూడు టేబుల్ స్పూన్లు

తయారీ :

పాన్​లో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. కాసేపయ్యాక కొత్తిమీర తరుగు కూడా వేసి కలపాలి. తర్వాత అందులో వేడి నీళ్లు పోసి, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, బీన్స్ తరుగు, మొక్కజొన్న గింజలు, సోయాసాస్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్​ వేసి, నిమ్మరసం చల్లి బాగా కలపాలి. చిన్న గిన్నెలో కార్న్​ఫ్లోర్ వేసి, నీళ్లు పోసి కలపాలి. ఆ నీళ్లను కూడా మిశ్రమంలో పోసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు చల్లుకుని మరోసారి సూప్​ని బాగా కలపాలి.

మునక్కాయలతో..

కావాల్సినవి :

మునక్కాయలు :  రెండు
క్యారెట్ తరుగు : పావు కప్పు నెయ్యి, వెల్లుల్లి, అల్లం తరుగు, 
నిమ్మరసం : ఒక్కో టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి :  రెండు
ఇంగువ : చిటికెడు
పసుపు :  పావు టీస్పూన్
ఉప్పు : సరిపడా
ధనియాల పొడి, జీలకర్ర పొడి : ఒక్కో టీస్పూన్
మిరియాల పొడి : అర టీస్పూన్
కొత్తిమీర : కొంచెం
వేడి నీళ్లు : పావు లీటర్

తయారీ :

ప్రెజర్ కుక్కర్​లో మునక్కాయ ముక్కలు, క్యారెట్, అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి వేడి నీళ్లు పోయాలి. మూతపెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత మూత తీసి నీటిని వడకట్టాలి. మునక్కాయ ముక్కల్ని వేరు చేసి వాటి  లోపలి గుజ్జును విత్తనాలతో పాటు తీసి మిక్సీజార్​లో వేయాలి. దాంతోపాటు ఉడికించిన క్యారెట్​ తరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి కొన్ని నీళ్లు  పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పాన్​లో నెయ్యి వేడి చేసి అందులో ఇంగువ, పసుపుతోపాటు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేయాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి నీళ్లు పోసి కలపాలి. సూప్ బాగా మరిగాక కొత్తిమీర చల్లాలి. 

రాగి సూప్

కావాల్సినవి :

రాగి పిండి :  రెండు టేబుల్ స్పూన్లు
నూనె :  ఒక టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి – ఒక్కో టీస్పూన్, నెయ్యి, మొక్కజొన్న గింజలు, 
క్యాప్సికమ్ తరుగు :  ఒక్కో టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు  : పావు కప్పు
క్యారెట్ :  ఒకటి, పచ్చిమిర్చి : రెండు
నీళ్లు, ఉప్పు :  సరిపడా
బెల్లం  : చిన్న ముక్క

తయారీ :

ఒక గిన్నెలో రాగి పిండి వేసి నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచాలి. పాన్​లో నూనె, వెన్న వేసి వేడిచేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ తరుగు, మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు ఒక్కోటిగా వేస్తూ కలపాలి. అవన్నీ వేగాక నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత రాగి పిండి కలిపిన నీళ్లు పోసి కలపాలి. చివరిగా బెల్లం ముక్క, కొత్తిమీర తరుగు వేసి మరికాసేపు మరిగిస్తే.. రాగి సూప్ రెడీ.   
 

మరిన్ని వార్తలు