T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

T20 World Cup 2024: ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

వెస్టింసీడ్, అమెరికా వేదికగా 2024 టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టింసీడ్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే ఐర్లాండ్ తో జూన్ 5 న తొలి మ్యాచ్ ఆడనుంది. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు  జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. ఇదిలా ఉండగా.. అభిమానులకు ఈ మ్యాచ్ లను ఫ్రీగా చూసే అవకాశం దక్కింది. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ టీ20 ప్రపంచకప్ 2024ను ఉచితంగా ప్రసారం చేయనుంది. 2023 వన్డే వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి బిగ్ టోర్నీలను సైతం హాట్ స్టార్ ను ఫ్రీగా చూసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడే క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

20 జట్ల మధ్య పోరు

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలను ఐసీసీ ఇప్పటికే ఖారారు చేసినట్లు సమాచారం. అందులో ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి. 

మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. 2013 నుంచి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూప్ లో ఉంటూ వస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు ఈ సారి కూడా ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి.        

ఐదేసి జట్లు చొప్పున 4 గ్రూపులు

జట్లు ఎక్కువ అవ్వడంతో ఈసారి టోర్నీని భిన్నంగా నిర్వహించనున్నారు. గతంలో తొలి రౌండ్‌ ముగిశాక సూపర్‌-12 మ్యాచ్‌లు ఆడేవారు. కానీ ఈసారి 20 జట్లను ఐదేసి జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి టాప్‌-2 టీమ్స్‌ సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ఆపై 8 జట్లను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా ఆడిస్తారు. గ్రూప్ దశలో ఆడిన ప్రదర్శన కారణంగా సూపర్-8 షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరతాయి.